NRI Devaraj is planting trees in other areas: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని రహదారికి ఇరువైపులా ఉన్న పురాతన భారీ వృక్షాలను అధికారులు తొలగించాలనుకున్నారు. అయితే ఇజ్రాయిల్‌లో నివాసం ఉంటున్న వృక్ష ప్రేమికుడు మన దేశ ఎన్ఆర్ఐ దేవరాజ్ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. హుటాహుటిగా కమ్మర్‌పల్లికి వచ్చి వాటిని నరకవద్దని అక్కడి అధికారులతో చెప్పారు. తన సొంత ఖర్చులతో వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్లి నాటిస్తానని అధికారులకు తెలిపారు.
అందుకు అనువైన స్థలం ఎంపిక చేసి వాటిని రహదారి పక్కనుంచి మెషనరీ సహాయంతో వేర్లు నుంచి తొలగించి, ప్రత్యేక వాహనంలో గ్రామంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్లి వాటిని నాటారు. ఎన్ఆర్ఐ దేవరాజ్ చెట్లను నాటిన తరవాత వాటి పెరుగుదలకు కావాల్సిన వర్మీ కంపోస్ట్, పొటాష్ వేశారు. ఈ విధంగా చెట్లను ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి తీసుకొని వెళ్లి నాటాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం.
అయినాసరే ఆ చెట్టు పెరుగుదలకు ఎన్నో ఏళ్లు పడుతోందని ఎన్ఆర్ఐ దేవరాజ్ గ్రహించారు. మానవ మనుగడకు, పర్యావరణ సమతుల్యానికి అవసరమైన చెట్లను నరకడం ఇష్టంలేకే సొంత ఖర్చుతో ఈ పనికి సిద్ధపడ్డానని, ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇలా చెట్లను నరకకుండా వేరే దగ్గర నాటడంతో వృక్ష ప్రేమికులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. రక్షించిన ఎన్ఆర్ఐ దేవరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. అందరూ ఈ విధంగానే వీటి ఆవశ్యకతను తెలుసుకొని వృక్షాలను రక్షించాలని కోరారు.
ఇవీ చదవండి: