దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నిజామాబాద్‌లో పోలింగ్ ఎన్నికల సంఘానికి సవాలుగా మారింది. తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువచ్చేందుకు పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈసీ నిబంధనల మేరకు నోటాతో కలిపి 64 మందికి మించి పోటీలో ఉంటే బ్యాలెట్‌తో ఎన్నిక నిర్వహించాలి. కానీ ఇందూరులో మాత్రం దేశ చరిత్రలో తొలిసారిగా ఒక కంట్రోల్ యూనిట్‌కు 12 ఈవీఎంలను అనుసంధానించేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది.
ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వద్దనే..
ఈవీఎంలపై ప్రతిపక్ష పార్టీలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తే వారి డిమాండ్‌కు ఊతమిచ్చినట్లు అవుతుందని ఎన్నికల సంఘం భావించింది. ఎం-3 రకం యంత్రాలను బీఈఎల్-బెంగళూరు, ఈసీఐఎల్-హైదరాబాద్ నుంచి తీసుకుంది. అందుకు అవసరమైన 26,000 బ్యాలెట్ యంత్రాలు గుర్తించడం కష్టమైనా యుద్ధప్రాతిపదికన వాటన్నింటిని సమీకరించింది.
750 మంది ఇంజినీర్లు
మొదటిసారిగా ఎం-3 రకం యంత్రాలను వినియోగిస్తున్న దృష్ట్యా భారీగా ఇంజినీర్లను కేటాయించింది. ఎక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తినా తక్షణమే సరిదిద్దేందుకు వీరిని నియమించింది. 600 మంది సరిపోతారని భావించినా.. ముందు జాగ్రత్తగా మరో 150 మందిని అధికంగా పంపింది. బీఈఎల్‌లో అంత మంది ఇంజినీర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈసీఐఎస్ నుంచి మిగతా వారిని నిజామాబాద్ పంపింది.
ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ఈవీఎంల పని తీరే ప్రశ్నార్ధకంగా మారుతుందనే భావనతో ఎన్నికల సంఘం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంది.
ఇవీ చూడండి: రాజ్ భవన్లో వైభవంగా ఉగాది వేడుకలు