తెలంగాణలో మరో శాసనసభ్యుడు కరోనా బారినపడ్డారు. నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా నలతగా ఉండడంతో నిన్న బాజిరెడ్డితో పాటు ఆయన సతీమణికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అవగా.. భార్యకు నెగెటివ్ వచ్చింది.
చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే దంపతులు హైదరాబాద్‌కు బయలుదేరారు. యశోద ఆస్పత్రిలో చికిత్స చేయించుకోనున్నారు. వారం కింద జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని హైదరాబాద్‌లో బాజిరెడ్డి కలిశారు. ముత్తిరెడ్డికి పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియడం వల్ల నిన్న బాజిరెడ్డి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అనుచరులు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు.
బాజిరెడ్డి శనివారం డిచిపల్లి మండలం బీబీపూర్ తండాలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఎమ్మెల్యే కుమారుడు, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డిచిపల్లి జెడ్పీటీసీ ఇందిర, ఎంపీపీ భూమన్న, ఆర్టీవో వెంకటయ్య, ఇతర మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానికులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలియడం వల్ల వీరందరూ ఆందోళన చెందుతున్నారు. ఎమ్మెల్సీ వీజీగౌడ్ తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
ఇవీ చూడండి: మొన్న మేనేజర్.. ఈరోజు అతడే.. కారణమేంటి?