Nizamabad Politics Latest News : నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్(Congress Operation Akarsh) అమలు చేస్తోంది. అధికార పార్టీకి చెందిన అసంతృప్త నేతలను గుర్తించి వారిని పార్టీలోకి తీసుకొస్తూ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో చేరికలను ప్రోత్సహిస్తోంది. బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ, ఆమె భర్త శరత్‌రెడ్డి మొదట్లో కాంగ్రెస్‌లోనే కొనసాగారు. పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పట్లో వీరు కాంగ్రెస్‌ను వీడి.. 2014లో బీఆర్ఎస్లో చేరారు. ఛైర్పర్సన్ టికెట్ కూడా ఆమె దక్కించుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడు సోహైల్ వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, ఛైర్పర్సన్ దంపతులకు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అనంతరం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
BRS Leaders Joining In Congress Nizamabad : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు(Congress Joinings in Telangana) గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మండవతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ సహా మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు హైదరాబాద్‌లోని మండవ నివాసానికి వెళ్లి.. పార్టీలోని ఆహ్వానించారు. ఆలోచించుకోవడానికి ఆయన రెండు రోజుల సమయం కావాలని చెప్పారు. నిజామాబాద్ నుంచి వచ్చిన ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించారు. మండవ కాంగ్రెస్‌లోకి వస్తే.. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేయించాలనేది కాంగ్రెస్ ఆలోచన.
Nizamabad Political War : మరోవైపు బీఆర్ఎస్ నేత ఆకుల లలిత(Ex MLC Akula Lalitha Join Congress) కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ శిష్యురాలిగా ఆకుల లలితకు పేరుంది. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. తర్వాత ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఆమె.. ఆరేళ్ల కిందట ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత పదవీ కాలం ముగిశాక మరోసారి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇస్తారేమోనని చూశారు. కానీ సహకారాభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చారు. ఇది ఆమెకు నచ్చక.. ఎలాగైన ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుని.. కాంగ్రెస్ గూటికి చేరాలని భావిస్తున్నారు.
Congress Party Operation Akarsh in Nizamabad : బోధన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఛైర్మన్ దంపతులు కాంగ్రెస్‌లో చేరినా అక్కడ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా పని చేయనున్నారు. నిజామాబాద్ రూరల్‌లో నగేష్‌రెడ్డి, భూపతిరెడ్డిలు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి మండవను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఆయన పోటీ చేయాలనుకుంటే వీరికి భంగపాటు తప్పదు. ఇక నిజామాబాద్ అర్బన్‌లో ధర్మపురి సంజయ్, మహేష్ కుమార్ గౌడ్లు టికెట్ కోసం పట్టు పడుతున్నారు. ఇప్పుడు ఆకుల లలిత పోటీలోకి వచ్చింది. లలితకు టికెట్ వస్తే మిగతా ఇద్దరికీ నిరాశ తప్పదు. ఇన్నాళ్లూ పని చేసి పోటీకి సిద్ధపడిన తరుణంలో బయటి నుంచి వేరేవాళ్లను తీసుకొచ్చి పోటీ చేయించడం పట్ల నేతలు అసంతృప్తితో ఉన్నారు.
Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో మూడు విడతలుగా కాంగ్రెస్ బస్సు యాత్ర.. 18న ప్రారంభం