పోలింగ్ జరగనుందా?
ఇక్కడి పోలింగ్ నిర్వహణపై అధికారులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మొదటి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందా? వాయిదా వేస్తారా? అనే దానిపై ఎన్నికల సంఘానికీ స్పష్టత రాలేదు.
బ్యాలెట్ బాక్స్ ఎలా ఉండాలి?
రాజకీయపార్టీలు పోను 178 మంది స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. బ్యాలెట్ ముద్రణ సమస్యకాక పోయినా బ్యాలెట్ బాక్స్‌లు ఎలా ఉండాలి, 185 మంది పోలింగ్ ఏజెంట్లను ఎక్కడ కూర్చోపెట్టాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఎం-3 యంత్రాల కోసం అన్వేషణ
బ్యాలెట్ పత్రాల ముద్రణ, బ్యాలెట్ బాక్స్‌ల తయారీ కన్నా ఎం-3 రకం ఈవీంలను సేకరించటమే సులువని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్వేషిస్తున్నారు. రాష్ట్రానికి తరలించేందుకు ఉన్న అవకాశాల గురించి ఆలోచిస్తున్నారు.
తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదే
పోలింగ్ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం అన్ని అంశాలను పరిశీలిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ వెల్లడించారు. తుది నిర్ణయం ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఈసీ నిర్ణయానికి అనుగుణంగా ఈవీఎం, బ్యాలెట్ ఏ విధానంలోనైనా పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.