ఊరంతా నిద్ర మత్తులో ఉంటే ఆయన మాత్రం గడ్డపార, గొడ్డలి, కొడవలి సంచిలో వేసుకుని బయల్దేరుతారు. నాటిన మొక్కలే తన పిల్లలుగా భావించి వాటి ఎదుగుదలే లక్ష్యంగా... ఆలనాపాలనా చూసుకుంటారు. ఆయనే నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లికి చెందిన మల్లయ్య. ప్రకృతిపై పెంచుకున్న ఇష్టం కారణంగా... మొక్కలతో గడపనిదే ఆయనకు రోజు గడవదు. ఇది గుర్తించిన పంచాయతీ సభ్యులు, అధికారులు... ఆయనను గ్రామంలో వన సేవకుడి(TREE WARRIOR)గా నియమించారు. హరితహారం(HARITHA HARAM) కింద నాటిన మొక్కలనే తన బిడ్డలుగా భావించి సంరక్షిస్తున్నారు.
సిర్నాపల్లి వనజీవి
ఇష్టమైన పని కావడంతో ఉదయం ఆరు గంటలకే మొక్కల చెంతకు చేరిపోతారు. మొదళ్లలో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించడం...సేంద్రీయ ఎరువులు వేయడం, కొమ్మలను కత్తిరించడంతోపాటు... ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి నాటుతుంటారు. వాటిని పశువుల బారి నుంచి రక్షించుకునేందుకు నిత్యం యుద్ధమే చేస్తారు. ఆరు పదుల వయస్సులోనూ... మొక్కల సంరక్షణ కోసం పోరాడుతున్నారు కాబట్టే... గ్రామస్థులంతా ఆయన్ని సిర్నాపల్లి వనజీవిగా పిలుస్తారు.
ట్రీ వారియర్
2019లో 600 మొక్కలు నాటగా ప్రస్తుతం అవి 12 నుంచి 16 ఫీట్ల ఎత్తు ఎదిగాయంటే అందుకు మల్లయ్యే కారణమని అధికారులు చెబుతున్నారు. సిర్నాపల్లి సందర్శించిన అధికారులందరూ మల్లయ్యను ప్రశంసిస్తున్నారు. ఇటీవల గ్రామ సందర్శనకు వచ్చిన ట్రైయినీ ఐఏఎస్(IAS OFFICERS) అధికారులు మల్లయ్యను ట్రీ వారియర్‌గా సంబోధించారు. కలెక్టర్‌తోపాటు అధికారులు మల్లయ్య చూపుతున్న చొరవను అభినందిస్తున్నారు.
అందరికీ ఆదర్శం
ఒకటి, రెండు మొక్కలను రక్షించేందుకే నానా ఇబ్బందులు పడుతుంటే... వందల మొక్కలు నాటి వాటిని కాపాడిన మల్లయ్యను అందరూ అభినందిస్తున్నారు. మల్లయ్యను స్ఫూర్తిగా తీసుకొని ప్రతిఒక్కరూ వన సేవకుడిగా మారితే తెలంగాణ హరితమయం అవుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: NH65: ఆరు వరుసల రహదారి విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడో..?