కరోనా వ్యాధి విస్తరించటానికి ప్రజల అశ్రద్ధనే కారణమని ప్రధాని మోదీ నిందించటం సరైంది కాదని నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు మండిపడ్డారు. వైద్యరంగాన్ని మెరుగుపరచకుండా... కావాల్సిన పరికరాలను సమకూర్చకుండా ప్రజలను తప్పుబట్టటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వైద్య సౌకర్యం అందించటానికి నిధులు కేటాయించకుండా కరోనాను ఏ విధంగా అరికడతారని విమర్శించారు.
కరోనా వ్యాధి మూలంగా ప్రజలు ఉపాధి కోల్పోయి వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలకు కేవలం బియ్యం, పప్పు ఇవ్వటం సరిపోదన్నారు. ఇతర నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవటానికి ప్రతి కుటుంబానికి రూ.7500 ఆర్థిక సహకారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలందరికీ మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని రమేశ్ కోరారు.