కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ నిప్పులు చెరిగారు. దేశంలో నిఘా వ్యవస్థ వైఫల్యం చెందిందంటూ మండిపడ్డారు. నియోజకవర్గంలో రోహింగ్యాలు ఉన్నారన్న ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇక్కడ రోహింగ్యాలు లేరని.. ఇతర దేశస్థులు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారంటే అది కేంద్రం వైఫల్యమే అని స్పష్టం చేశారు. దేశంలో నిఘా వ్యవస్థ, భద్రతా వ్యవస్థ విఫలమైనందునే ఇతర దేశస్థులు అక్రమంగా చొరబడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఒకే కుటుంబం నుంచి 32 మంది నకిలీ పాస్‌పోర్టులు పొందారంటే రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ అధికారిని సస్పెండ్ చేసి పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం వైఫల్యమే కారణం
నకిలీ పాస్‌పోర్టులను మంజూరు చేసింది భాజపా ప్రభుత్వమే అని షకీల్ ఆరోపించారు. ఎంపీ అర్వింద్ అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పాస్‌పోర్టులకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే హోం మంత్రి, ప్రధాన మంత్రి, సరిహద్దు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని అడిగారు. ఇతర రాష్ట్రాల్లో తప్పుడు ధ్రువపత్రాలతో ఆధార్ కార్డులు తీసుకుంటున్న నేపాలీ, బంగ్లాదేశీయులు, పాకిస్థానీలు యథేచ్ఛగా సంచరిస్తున్నారంటే జాతీయ భద్రతా సంస్థ వైఫల్యమే అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పోలీసులు కూంబింగ్‌లో పట్టుబడ్డ మిలీషియా సభ్యులు