జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 500 లకు పెంచుతున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడించారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వంద పడకలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చి ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల యజమాన్యాలు కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ముందుకు రావాలన్నారు.
ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా బాధితులకు కోసం ప్రత్యేకంగా వార్డును తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రిలోని కొవిడ్ పరీక్షలు, వాక్సినేషన్ విభాగాలను పరిశీలించారు. గర్భిణులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేసులు పెరగడం పట్ల పురపాలికలు, పంచాయతీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను సూపరింటెండెంట్ నాగరాజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. పరిశీలన తర్వాత మున్సిపల్ ఛైర్మన్ పండిత్ వినీత, వైస్ ఛైర్మన్ మున్ను, డిప్యూటీ డీఎంహెచ్ ఓ రమేష్, బల్దియా అధికారులు, ప్రైవేట్ వైద్యులతో జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు.