ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్యం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిని నడ్డి విరిచే విధంగా ఉన్నాయని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాలన మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 15 రోజుల కాలంలో 18 రూపాయలు పెరగడం ఏంటని ప్రశ్నించారు. భాజపా ప్రభుత్వం కేవలం ప్రచారాలకు పరిమితమై పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు.
గత పక్షం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న ప్రధాని కనీసం సమీక్ష నిర్వహించకపోవడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 29న నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిని కార్యకర్తలు విజయవంతం చేయాలని సూచించారు.