రామునిపై తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వా లక్ష్మి నర్సయ్య విమర్శించారు. రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తుంటే వారికెందుకు అంత బాధ? అని ప్రశ్నించారు.
నిజామాబాద్ నగరం 24వ డివిజన్లో జరుగుతున్న నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతీ హిందూ బంధువు భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.
కుట్రలు..
గతంలో కొంతమంది కుహనా లౌకికవాదులు భారత సనాతన ధర్మాన్ని, సంస్కృతిని తెరమరుగు చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. హిందూ ధర్మం, దేవాలయాలపై దాడులు చేస్తున్న దురాక్రమణదారులకు హెచ్చరికలా మందిరం నిర్మాణం జరగబోతోందని తెలిపారు.
తెరాస వైఖరి..
హిందువుల ఓట్లతో గెలిచి.. రాముడి కొసం మందిరం నిర్మిస్తుంటే ఎమ్మెల్యే విరాళాలు ఇవ్వొద్దనడం సిగ్గుచేటన్నారు. విరాళాల పేరుతో బిక్షం ఎత్తుకుంటున్నారనడం హిందూ ధర్మంపై తెరాస వైఖరేంటో అర్థమవుతోందని విమర్శించారు.
నిజంగా దమ్ముంటే విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. హిందువుల ఓట్లు లేకుండా గెలిచి చూపించాలి. హిందూ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి.
-బస్వా లక్ష్మి నర్సయ్య, భాజపా అధ్యక్షుడు
ఇదీ చూడండి: పీఎంఏవైతో పేదల సొంతింటి కల సాకారం: కేంద్రమంత్రి