కేంద్ర ప్రభుత్వ పథకాలు నిజామాబాద్ జిల్లాలో క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరీ కమిటీ దిశా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై సుమారు 3 గంటల పాటు సమావేశంలో చర్చించారు.
దిశా సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భాజపా జిల్లా పార్టీ కార్యాలయంలో భాజపా నాయకులతో ఎంపీ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లిస్తోందని ఆక్షేపించారు.
అవగాహన లేని చర్యల వల్ల జిల్లాకు కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా వృథాగా పోతున్నాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.600 కోట్ల నిధులు మంజూరు చేస్తే... జిల్లాకు కేవలం రూ. 21 లక్షలు కేటాయించడం స్థానిక మంత్రి చేతగానితనమని ఎద్దేవా చేశారు.