ఏటా ఆస్తి పన్ను డిమాండు రూ.27 కోట్లు ఉండగా రూ.21 కోట్ల నుంచి రూ.24 కోట్ల వరకు వసూలవుతోంది. పాత బకాయిదారుల వివరాలు లేకపోవడం, సంవత్సరాల నుంచి పన్ను చెల్లించని వారు ఏదో ఒక కారణంతో కోర్టుకు వెళ్లడం, పన్ను ఎక్కువగా వచ్చిందని తగ్గించాలంటూ దరఖాస్తు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. అధికారులు గతంలో వీరి గురించి పట్టించుకునేవారు కాదు.
వచ్చే నెల 15 వరకే...
ఆస్తి పన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బకాయిదారులు ఈనెల 1 నుంచి కేవలం 10 శాతం వడ్డీతో పన్ను చెల్లించాలని సూచించింది. ఈ మేరకు కార్పొరేషన్‌కు రోజూ రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు పన్ను వసూలవుతుంది. వచ్చే నెల 15 లోగా ఒకేసారి చెల్లించేవారికే ఈ అవకాశం వర్తిస్తోంది.
* భువన్ యాప్ ద్వారా ఇళ్లు, భవనాలను కొలిచి ఆస్తి పన్ను విధించారు. ఇలా చేయడంతో ఒక్కసారిగా పన్ను పెరిగిందంటూ.. సరిచేయాలని 300 మంది దరఖాస్తు చేశారు. వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉండడంతో వాటిని సరి చేసే అవకాశం ఇక్కడి అధికారులకు లేదు. ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. అయితే 90 శాతం వడ్డీ మాఫీతో దరఖాస్తులు పెట్టుకున్న వారిలో చాలా మంది బకాయిలు కట్టేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం ఆస్తి పన్నులో 90 శాతం వడ్డీ మాఫీ ఇచ్చింది. నగర వాసులు దీన్ని సద్వినియోగం చేసుకొని 10 శాతం వడ్డీతో బకాయిలు చెల్లించాలి. వచ్చే నెల 15 వరకు అవకాశం ఉంది. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలి.
- జితేష్ వి పాటిల్, నగర పాలక సంస్థ కమిషనర్
సోమ, బుధవారాల్లో రెవెన్యూ మేళాలు
ఆస్తి పన్నుతో పాటు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి వచ్చే నెల 15 వరకు సోమ, బుధవారాల్లో కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్‌లో రెవెన్యూ మేళాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటి నంబర్ ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, ఆస్తి పన్ను ఎక్కువగా రావడం, ఇంటి రిజిస్ట్రేషన్ పేరు మార్పు చేయడం, ఆన్‌లైన్‌లో దొర్లిన తప్పులను మేళాలో పరిష్కరించనున్నారు.
ఇదీ చదవండి: భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం