పోడు భూముల విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా వద్ద సేవాలాల్ ఆలయ రాజగోపురం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్లతో కలిసి పాల్గొన్నారు. పోడు భూముల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. పోడు భూముల విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే బాగుండదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అటవీ అధికారులను హెచ్చరించారు.
కొత్తగా పోడు చేసుకునే అవకాశం ఇవ్వకుండా.. అలాగే పాతవారిని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు గిరిజనులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ప్రభుత్వం ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తోందన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం అడవులను రక్షించేందుకు అటవీ అధికారులతో పాటు పోలీసులను కూడా సమన్వయం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు సమస్యకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ నగర శివారులోని బోర్గాంలోని గణపతి ఆలయాన్ని దర్శించుకున్నారు.