నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి కేవలం 374 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. చాలా బెడ్స్ ఖాళీగా ఉన్నాయని.. పాజిటివ్ శాతం కూడా 8 కి పడిపోయిందని తెలిపారు. జిల్లాలోని కలెక్టర్ ఛాంబర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి (Mla prashanth reddy) కరోనా పరిస్థితిపై సమీక్షించారు.
బ్లాక్ ఫంగస్ కు వైద్యం..
బ్లాక్ ఫంగస్ సోకిన వారు హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నామని అన్నారు. అందులో అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చడంతో పాటు.. అవసరమైన మందులు రాగానే చికిత్సలు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలు భయపడవలసిన అవసరం లేదని.. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్సలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షలో కలెక్టర్, వైద్యారోగ్య శాఖ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.