MINISTER PRASHANTH REDDY: రాజకీయ లబ్ధి కోసమో ఓట్ల కోసమో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సమాజంలోని వివిధ వర్గాలతో మేధోమథనం చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ దళితబంధుకు రూపకల్పన చేశారని మంత్రి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో దళితబంధు పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్ల మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు.
అరవై ఏళ్లుగా దళితుల కోసం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు లేకుండానే నేరుగా లబ్ధిదారులకు రూ.పదిలక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదని తెలిపారు. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని తమకు నచ్చిన వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని మంత్రి పేర్కొన్నారు.
తద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించాలన్నదే దళిత బంధు పథకం ఉద్దేశమని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 56 వేల దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: 'విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఏపీది అర్థంలేని వాదన'