ప్రతి ధాన్యపు గింజను కొంటామన్న భరోసా రైతులకు కల్పించాలని నిజామాబాద్ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లా పీఏసీఎస్ ఛైర్మన్లతో వరిధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి... హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులతో మంత్రి సమీక్షించారు.
క్షేత్రస్థాయిలో చిన్నచిన్న సమస్యలను పీఏసీఎస్ ఛైర్మన్లు పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి హమాలీలు రానందున గ్రామాల్లోనే హమాలీలను తయారు చేసుకోవాలని, ధాన్యం రవాణాకు ఇబ్బంది లేకుండా స్థానిక లారీలు, ట్రాక్టర్లను వినియోగించుకోవాలని చెప్పారు. తెల్లజొన్నలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, పొద్దుతిరుగుడును కేంద్రం 25 శాతం మాత్రమే కొంటుండగా... రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకు నష్టం కలిగించిన ఉదంతంలో ఓ రైస్ మిల్లును సీజ్ చేసినందుకు కలెక్టర్, అధికారులను మంత్రి అభినందించారు. రైస్ మిల్లర్లు నిబంధనల ప్రకారం నడుచుకోపోతే మండల నోడల్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష