Manjeera River Bridge Works Completed in Nizamabad : నిజాం హయాంలో మహారాష్ట్ర వైపు రాకపోకలు సాగించేందుకు మంజీరా నదిపై (Manjeera River Bridge) 1932లో రాతి వంతెన నిర్మించారు. ఇదే వంతెనపై దశాబ్దాల పాటు రాకపోకలు సాగాయి. అయితే, వానాకాలంలో వరదకు రాతి వంతెన మునిగిపోతూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. దీనికి తోడు వాహనాల సంఖ్య పెరగటంతో 1984లో నదిపై ఎత్తైన మరో వారధిని నిర్మించారు. కొన్నేళ్ల క్రితం అది కూడా దెబ్బతినటంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ప్రత్యామ్నాయం లేకపోవటంతో నిజాం నాటి రాతి వంతెన పైనుంచి తేలికపాటి వాహనాలను అనుమతిస్తున్నారు. ఏటా వరద వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రవాణా పూర్తిగా నిలిచిపోతుంది.
Manjeera Bridge on Telangana Maharashtra Border : జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మహారాష్ట్రలోని బార్సి నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు ఎన్హెచ్-63గా గుర్తించారు. ఈ దారి సాలుర సమీపంలోని మంజీర మీదుగా వెళ్తుండటంతో శిథిల స్థానంలో, నూతన బ్రిడ్జిని నిర్మించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. రెండేళ్ల కింద రూ.188 కోట్లతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Central Minister Nitin Gadkari) వంతెన మంజూరు చేసి పనులు చేపట్టారు.
'కొత్తగా బ్రిడ్జి కట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు అందరికి సులువుగా పనులు జరుగుతున్నాయి. ఇంతకముందు మాకు చాలా ఇబ్బందులు ఉండేవి. రాకపోకలకు ఇబ్బంది లేకుండా బ్రిడ్జి కట్టడంతో ప్రయాణం తేలిక అవుతుంది. గత రెండేళ్ల నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎక్కువ కాలం ఈ బ్రిడ్జి ఉండి ఎంతో మంది ప్రయాణాన్ని సులువుగా చేస్తుంది. - స్థానికులు
'మాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మహారాష్ట్రకు వెళ్లాలంటే వర్షాకాలంలో 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ బ్రిడ్జి ద్వారా మాకు చాలా సులువుగా ఉంటుంది. కేవలం రెండు కిలోమీటర్లలోనే మహారాష్ట్రకి వెళ్లగలుగుతున్నాం. ఇంతకముందు ఉన్న బ్రిడ్జిలు కూలి పోవడంతో రెండు మూడు సంవత్సరాలు బాగా అవస్థలు పడ్డాం. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి రాకపోకలు సజావుగా సాగుతున్నాయి.' -స్థానికులు
బ్రిడ్జి నుంచి బోధన్ వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర జాతీయ రహదారి బైపాస్ విస్తరణ పనులు సైతం కొనసాగుతున్నాయి. వంతెన పూర్తి కావడంతో త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మహారాష్ట్ర సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి పలు సరకు రవాణా వాహనాలు ఇదే రహదారి మీదుగా నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక వైపు ప్రయాణిస్తుంటాయి. నూతన వంతెన అందుబాటులోకి వస్తే భారీ వాహనాలకు ప్రయాణ దూరం తగ్గనుంది.