సాధారణ, మధ్యతరగతి , పేద ప్రజలు కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ నిజామాబాద్ గాంధీ చౌక్‌లో వామపక్షాలు ధర్నా చేశాయి. పరిశ్రమలు సరిగ్గా నడవక, కుటుంబ పోషణ భారమైందని వామపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒకటి రెండు కరోనా కేసులు ఉన్న సందర్భాల్లో లాక్డౌన్ పేరుతో ప్రజలను నిర్బంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు... అనంతరం ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయని స్పష్టం చేశారు.
వందల రూ.కోట్లు లూటీ...
ఎంతో మందికి ఉపాధి లేక నిత్యవసర వస్తువులు కొనుక్కోలేక ఆకలితో అలమటిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్న పరిస్థితులకు దారితీసిందని భయాందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా వందల కోట్ల రూపాయలతో నూతన సచివాలయ భవనాల సముదాయాల పేరిట ప్రజా ధనం లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజలు వాళ్లను గమనిస్తున్నారు...
విద్యా వ్యవస్థ, కార్మిక వ్యవస్థ, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తదితర రంగాలను విధ్వంసం చేసి ప్రజలకు ఉపాధి, తిండి లేకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెరాస సర్కార్‌కు కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీయూఎస్ఐ జిల్లా నేతల మల్లికార్జున్, ఎంసీపీఐయూ జిల్లా నాయకుడు శ్రీనివాస్, న్యూడెమోక్రసీ నాయకులు పరుచూరి శ్రీధర్ జెల్ల, మురళి, ఎల్బీ రవి, సీపీఎం నాయకులు మల్యాల గోవర్ధన్, సుజాత, కృష్ణ, సీపీఐ నాయకులు రాజన్న, తదితరులు పాల్గొన్నారు.