రాష్ట్ర వ్యాపంగా పలు జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడా భారీ వర్షం, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వర్షం పడింది. నాలుగైదు రోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది.
ప్రజల ఇక్కట్లు
భారీ వర్షంతో పాటు ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై వరదనీరు నిలిచిపోయి వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లో వర్షపు నీరు చేరి వ్యాపారులకు ఇబ్బంది తప్పలేదు. ఇదిలా ఉండగా వారం రోజుల తర్వాత వరుణుడి రాకతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
మరో మూడు రోజులు
రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.