నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా ఉపాధి లేక.. ఇబ్బందులు పడుతున్న అసంఘటితరంగ కార్మికులకు ప్రతి నెల పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడి 11 కోట్ల మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వ్యాపారాలు నమ్ముకొని బతికే కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఐఎఫ్టీయూ నగర అధ్యక్షులు ఎల్పీ రవికుమార్ అన్నారు. నిత్యావసర వస్తువులు ఆరు నెలల పాటు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలపైన భారం మోపుతూ పెట్రోల్, డీజిల్‌పైన వచ్చే ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్నట్టు అవాస్తవాలు చెప్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నం కార్మికుల హక్కులను కాలరాయడమే అన్నారు. ఆ ఆలోచనను విరమించుకోకుంటే.. తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు బి.భూమన్న, జిల్లా కార్యదర్శి జెల్ల. మురళి, నగర ప్రధాన కార్యదర్శి ఎం. శివ కుమార్, సాయిబాబా పాల్గొన్నారు.