ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు దమ్ బిర్యానీ హోటళ్లు వందల సంఖ్యలో ఉండేవి. ప్రతి ఒక్కరూ ఈ రకాన్ని ఇష్టంగా తినేవారు. తాజాగా మండి బిర్యానీ పరిచయమైంది. యువత దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ప్రత్యేకంగా లభించే ఈ వంటకం ఇంతకు ముందు హైదరాబాద్‌లో మాత్రమే దొరికేది. ఇప్పుడు జిల్లాకేంద్రాల్లో మండి పేరుతో హోటళ్లు ఏర్పాటయ్యాయి. అదేవిధంగా కొన్ని హోటళ్లలో మట్టి పాత్రలోనూ ‘బిర్యానీ’ రుచి చూపిస్తున్నారు. దీన్నే కుండ బిర్యానీగా పిలుస్తున్నారు. వీటికి తోడు బకెట్ బిర్యానీ పేరిట హోటళ్లు వెలిశాయి. కుటుంబానికి సరిపడేంతా బకెట్‌లో ప్యాక్ చేసి ఇస్తున్నారు.
![If you go with friends eat to Mandi Biryani at nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10025356_mandi-1.jpg)
ఆరగిస్తున్న చిన్నారులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారుగా ఐదు టన్నుల కోడి మాంసాన్ని బిర్యానీ కోసం వాడుతున్నట్లు ఓ వ్యాపారి పేర్కొన్నారు. కేవలం చికెన్ కోసమే హోటళ్ల నిర్వాహకులు రోజుకి రూ.10 లక్షలు వెచ్చిస్తుండగా.. రూ.1.20 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోందని అంచనా.
ప్రత్యేక సిబ్బంది
వినాయక్‌నగర్‌లోని ఓ హోటల్‌లో రోజుకి 120 డోర్ డెలివరీలు జరుగుతాయి. ఇందులో బిర్యానీ ఆర్డర్లు 80కు పైగా ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆర్డర్ల ప్యాకేజీ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
రాయితీలు
రెండు జిల్లా కేంద్రాల్లో ఫుడ్ డెలివరీ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. సగటున రోజుకి 12-14 వేల డోర్ డెలివరీలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులోనూ 65 శాతం బిర్యానీలే డెలివరీ చేస్తున్నట్లు ఓ సంస్థలో పనిచేసే ఉద్యోగి తెలిపారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తిగా ఈ ఆర్డర్లే వస్తున్నట్లు పేర్కొన్నారు. రాయితీలు ప్రకటిస్తుండటంతో వీటికి ఆదరణ పెరుగుతోంది.
ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా కారణంగా హోటళ్ల నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బంది విధిగా మాస్కు ధరించేలా చూస్తున్నారు. హోటల్ ప్రవేశం దగ్గరే శరీర ఉష్ణోగ్రత పరిశీలిస్తున్నారు. డైనింగ్ టేబుళ్ల మధ్య స్థలం వదిలేస్తున్నారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు.
కొత్త కళ
నగర శివార్లలో ఇటీవల డ్రైవ్‌ఇన్ల పేరుతో ఫుడ్‌కోర్టులు ఏర్పాటయ్యాయి. కంఠేశ్వర్, మానిక్‌బండార్, బర్దీపూర్ శివార్లలో ఉన్న వీటిలో బిర్యానీలకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక్కడికి కుటుంబ సభ్యులతో వెళ్లడానికి నగర వాసులు ఇష్టపడుతున్నారు. వారాంతాల్లో సందడి నెలకొంటుంది.
అభిరుచులకు తగ్గట్లు
బిర్యానీ తయారు చేయడం సమయంతో కూడుకున్న పని అని బిర్యానీ చెఫ్ జావిద్ తెలిపారు. అందరి అభిరుచులకు తగ్గట్టుగా చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. రోజూ 50 కిలోల చికెన్ బిర్యానీ చేస్తామని.. గతంతో పోలిస్తే తినేవారు పెరిగారని వెల్లడించారు.
![If you go with friends eat to Mandi Biryani at nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10025356_mandi-2.jpg)
రెండింతలైన చికెన్ సరఫరా
నిత్యం 3 క్వింటాళ్ల చికెన్ సరఫరా చేస్తానని చికెన్ వ్యాపారి ఇనూస్ తెలిపారు. గతంలో రోజుకు 1.50 క్వింటాళ్లు మాత్రమే అమ్మేవాడినని. లాక్‌డౌన్ తర్వాత సరఫరా రెండింతలు పెరిగిందని చెబుతున్నాడు.
ఆదివారాల్లో మరిన్ని విక్రయాలు
కొన్నాళ్లుగా మండి బిర్యానీ తినేవారు ఎక్కువయ్యారని మండి బిర్యానీ వ్యాపారి సౌమిత్‌రెడ్డి పేర్కొన్నారు. తమ వద్దే 10 రకాలు లభిస్తాయని వెల్లడించారు. ఒక్క చికెన్‌లోనే ఐదురకాలు అందిస్తున్నామని.. ప్రత్యేకంగా ఆదివారాల్లో సందడి ఎక్కువగా ఉంటోందని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి : 14 ఫేక్ రుణాల యాప్‌లు.. అదుపులో నిందితులు