Home Voting in Telangana : రాష్ట్రలో ఎన్నికల సంఘం మొదటిసారిగా.. అమలు చేసిన ఇంటి నుంచి ఓటు వేసే విధానం మంచి ఫలితం ఇచ్చింది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు కొన్ని సార్లు ఓటు వేయలేకపోయేవారు. కానీ ఇంటి నుంచి ఓటు ద్వారా వారంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండున్నర వేల మందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసి ఆనందం వ్యక్తం చేశారు.
మొదటిసారి ఇంటి నుంచే ఓటు వినియోగం ప్రక్రియ విజయవంతమైంది. 80ఏళ్లు పైబడిన వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగుల నుంచి ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం (Election Commission) అవకాశం కల్పించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో 2వేల 360 మంది దరఖాస్తు చేసుకోగా... ఈనెల 23, 24, 25 తేదీల్లో ఈ ప్రక్రియ చేపట్టారు.
ఎన్నికల నిర్వహణకు ఈసీ జాగ్రత్తలు - అధికారులకు తప్పని ఉరుకులు పరుగులు
ఎన్నికల సిబ్బంది, బీఎల్వో, పోలీసులతో కూడిన బృందం వారి ఇళ్లకు వెళ్లి బ్యాలెట్ రూపంలో రహస్యంగా ఓటు వేయించారు. 2వేల 360 మందిలో 2వేల 91 మంది ఓటర్లు ఓటు వేశారు. ఇందులో 80ఏళ్ల పైబడిన వాళ్లు 13వందల 10 ఉండగా.. 12వందల 8 మంది ఓటు వేశారు. దివ్యాంగులు వెయ్యి 50 మంది ఉండగా.. వెయ్యి 41 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Home Voting Completed in Nizamabad : ఆర్మూర్ నియోజకవర్గంలో 281 మంది వృద్ధులు, 205 మంది దివ్యాంగులు, బోధన్ నియోజకవర్గంలో 173 మంది వృద్ధులు, 74 మంది దివ్యాంగులు, నిజామాబాద్ అర్బన్‌లో 53 మంది వృద్ధులు, 13 మంది దివ్యాంగులు, నిజామాబాద్ గ్రామీణంలో 151 మంది వృద్ధులు, 179 మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 331 మంది వృద్ధులు, 329 మంది దివ్యాంగులు, బాన్సువాడలో 235 మంది వృద్ధులు, 241 మంది దివ్యాంగులు తమ ఓటు వేశారు.
ప్రతి ఒక్క ఓటర్ని పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం ఎలా?
కామారెడ్డి జిల్లాలో సైతం 542 మంది 80ఏళ్లు పైబడిన వృద్ధులు, 40శాతంపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 495 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో 171 మంది, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 201మంది, కామారెడ్డి నియోజకవర్గంలో 123 మంది ఓటేశారు.