SRSP: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ జలాశయంలోకి వరద ప్రవాహం భారీగా చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 22,187 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 718 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,070.7 అడుగులుగా నమోదైంది.
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 30.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 12 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది.
నిండుకుండల్లా ప్రాజెక్టులు..: మరోవైపు రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకూ వరద నీరు పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బ్యారేజీలకు వరద తాకిడి పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో 24 గేట్లు ఎత్తి... నీటిని భారీగా దిగువకు పంపిస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీకి 60,530 క్యూసెక్కుల ప్రవాహం రాగా... 24 గేట్లు తెరిచి 62,940 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డలో 9.8 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు... పరవళ్లు తొక్కుతున్నాయి.
ఇవీ చూడండి..:
కాళేశ్వరానికి జలపరవళ్లు.. మేడిగడ్డ బ్యారేజి 24 గేట్లు ఎత్తిన అధికారులు