Heavy Rains in Nizamabad District : దాదాపు నెల రోజుల విరామం తర్వాత ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఉమ్మడి నిజామాబాద్(Nizamabad Rains) జిల్లావ్యాప్తంగా జోరువానలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. రైల్వేస్టేషన్, బస్టాండ్, వీక్లీ మార్కెట్, బోధన్ రోడ్డు సహా పలు రహదారులు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. పూలాంగ్ వాగు.. వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. కాలనీలలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
మోపాల్ మండలంలో 15, ఇందల్వాయి, డిచ్పల్లిలో 14 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జుక్కల్- బస్వాపూర్ మధ్యలో వంతెన పనులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ రోడ్డు.. వర్షానికి కోతకు గురవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Telangana Rains : డిచ్ పల్లి- నిజామాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ వెళ్లేవారు ముల్లంగి, మోపాల్, బోర్గాం మీదుగా ప్రయాణిస్తున్నారు. భారీ వాహనాలను మాత్రం ఆర్మూర్ నుంచి అనుమతిస్తున్నారు. నడిపల్లి పెట్రోల్ బంకుల వద్ద.. రోడ్డు పైనుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. రోడ్డుపైకి పోటెత్తిన ప్రవాహంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చెరువు తూములను ఆక్రమించి వెంచర్లు వేయడం వల్లే రోడ్డుపైకి భారీగా నీరు చేరడమే కాక.. 200 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఏడు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిరికొండ మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జక్రాన్పల్లి, డిచ్పల్లి, మోపాల్, నిజామాబాద్ గ్రామీణం, ధర్పల్లి, ఇందల్వాయి మండలంలోని చెరువులు అలుగు పోస్తున్నాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉద్ధృతికి గడ్కోల్ వద్ద.. లోలెవెల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇందల్వాయి మండలంలోని వాడి వద్ద వాగు ప్రవాహ ధాటికి.. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆగస్టులో ఎండలకు సోయా, పత్తి, మొక్కజొన్న పంటలు ఎండు మొహం పట్టగా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Rains in Kamareddy : కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. వర్షాల దృష్ట్యా ప్రాథమిక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గాంధారి మండలంలో పాతికేళ్ల తర్వాత.. గాంధారివాగు పోటెత్తడంతో పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. వాగు సమీపంలోని కాలనీలోకి వరద పెద్దఎత్తున చేరుతోంది. మాతుసంఘం వద్ద.. పశువుల కోసం వెళ్లి వాగులో రైతు సంగయ్య చిక్కుకుపోయాడు. స్థానికుల సమాచారంతో ఎమ్మెల్యే సురేందర్, కలెక్టర్ జితేశ్ సహాయక చర్యలు పర్యవేక్షించారు. సంగయ్యతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎట్టకేలకు ప్రత్యేక బోటులో.. సంగయ్యను కాపాడారు.
Heavy Rains in Telangana Today : ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన.. తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు