Gun firing at Indalwai Toll Gate in Nizamabad : బెదిరింపులు.. దోపిడీలు.. అపహరణలు.. హత్యలు.. ఇవన్నీ చేయాలంటే గన్నులుండాలి. కూర్చొని పరిష్కరించుకోవడం కాదు.. ధనాధన్ ఫటాఫట్‌గా వ్యవహారం తేలిపోవాలని రౌడీషీటర్లు, నేరస్థులు పిస్తోళ్లు.. రివాల్వర్లను వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, వారి అనుచరులు, వ్యాపారులూ స్థిరాస్తి సెటిల్‌మెంట్లకు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. రౌడీషీటర్లు, నేరస్థుల చేతుల్లోనే 80 శాతం వరకూ ఆయుధాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ చిన్నపాటి ఘర్షణ జరిగినా తుపాకులతో కాల్పులు జరపడం ఈ మధ్య పరిపాటిగా మారింది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి.
ఆదివారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద జరిగిన కాల్పులు కలకలం రేపాయి. తన వాహనంపై దొంగలు దూసుకురావడంతో.. ఆత్మరక్షణ కోసం ఎస్సై గాల్లో కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్ చోరీ చేసిన అంతర్‌రాష్ట్ర ముఠా 44వ జాతీయ రహదారి మీదుగా వెళ్తోందని పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి సమాచారం వచ్చింది. ఈ క్రమంలో విషయం తెలిసిన ముప్కాల్ పోలీసులు వారిని వెంబడించగా దొంగల ముఠా రూట్ మార్చి డిచ్‌పల్లి వైపు వెళ్లారు.
మాల్లోకి చొరబడి కాల్పులు.. 8 మంది మృతి.. నిందితుడు హతం
అప్పుడు ఆ మార్గమధ్యలోని ఇందల్వాయి, దర్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇందల్వాయి ఎస్సై నరేశ్, దర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఇందల్వాయి టోల్‌గేటు వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దొంగల ముఠా అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో తమ కారుతో దర్పల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం ఎస్సైను సైతం ఢీకొట్టేందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం ఆయన రెండు సార్లు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో దుండగులు పక్కవైపు నుంచి పారిపోయినట్లు ఇందల్వాయి ఎస్సై నరేశ్ తెలిపారు. నిన్న అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అంతర్‌రాష్ట్ర ముఠాపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ చెప్పారు.
ఈమధ్య కాలంలో భాగ్యనగరంలో కాల్పులు కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలోను నగరంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టప్పాచబుత్రాలో ఆకాశ్ సింగ్(26) అనే వ్యక్తిపై కాల్పులు జరిగాయి. దుండగుల కాల్పుల్లో ఆకాశ్ సింగ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. పాత కక్షలే కాల్పులకు కారణమని పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి :