నందిపేట్ మండల కేంద్రంలో గంగపుత్ర చైతన్య సమితి నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల గంగపుత్రులు సమావేశం నిర్వహించారు. మండలంలో చేపల అమ్మకానికి ఏకగ్రీవ తీర్మానం చేశారు. వాటిలో తెల్ల చేపలు (బొచ్చా, రవ్వు, బంగారు తీగ) 160 కిలోలు, నల్లటి చేపలు(కొర్రమీను, పాపేర, రొయ్యలు)ను 400 రూపాయలకు అమ్మకాలు జరపాలని అన్ని గ్రామాల గంగపుత్రులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇకపై తాము నిర్ణయించిన ధరకే చేపల అమ్మకాలు సాగిస్తామని జిల్లా కమిటీ సభ్యుడు పల్లికొండ నర్సయ్య గంగపుత్ర స్పష్టం చేశారు. తమపై అకారణంగా వీడీసీ జులుం ప్రదర్శిస్తే సహించబోమని మరో సభ్యుడు అల్గోట్ రమేశ్ గంగపుత్ర హెచ్చరించారు.
మాకూ గిట్టుబాటు ధర కావాలి...
గ్రామాభివృద్ధి కమిటీ తమను అడ్డుకుని డబ్బులు అడుగుతున్నారని.. అది మంచి పద్ధతి కాదని ఉట్నూరు బాలయ్య గంగపుత్ర అన్నారు. తమ కమిటీ నిర్ణయించిన ధరలకే చేపలు కొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మటన్, చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని... పోషకాలు పుష్కలంగా లభించే చేపల ధర మాత్రం వాటితో పోల్చితే చాలా తక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అతి తక్కువ ధరకు విక్రయిస్తే తమకు గిట్టుబాటు ధర సైతం రావట్లేదని వాపోయారు. అందుకే గంగపుత్ర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తమ చేపలు, రొయ్యల ధర తామే నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా గంగపుత్ర చైతన్య సమితి నాయకులు ఉట్నూరు నారాయణ గంగపుత్ర , మండల కమిటీ అధ్యక్షుడు పల్లికొండ భూమేష్ , బొజేందర్, రఘు, పురుషోత్తం, రాము , మండల పరిధిలోని అన్ని గ్రామాల గంగపుత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రేపటినుంచి ఆ రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటన