Frog in tiffin: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో అల్పాహారంలో కప్ప రావడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. మంగళవారం ఉదయం బాలికల వసతిగృహంలో విద్యార్థినులకు అల్పాహారంగా వెజ్ బిర్యానీ వడ్డించారు. ఓ విద్యార్థిని తింటుండగా కప్ప కళేబరం రావడంతో భయంతో వణికిపోయింది. అప్పటికే చాలా మంది వెజ్‌బిర్యానీ తిన్నట్లు విద్యార్థినులు తెలిపారు. మెస్ సిబ్బందిపై వారు మండిపడ్డారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఇలా జరిగిందని విద్యార్థినులు ఆరోపించారు.
వసతి గృహం నుంచి అడ్మినిస్ట్రేషన్ భవనం వరకు ర్యాలీగా వచ్చి వీసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని, సమయపాలన పాటించట్లేదని విద్యార్థినిలు ఆరోపించారు. రిజిస్ట్రార్ ఆచార్య శివశంకర్ వివరాలు తెలుసుకొని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మెస్‌ను పరిశీలించారు. ఆహారంలో కప్ప వచ్చిన విషయమై ఆరా తీశారు. ఆహారం వండిన తర్వాత కప్ప వచ్చి పాత్రలో పడి ఉంటుందని వంట మనిషి చెప్పడంతో రిజిస్ట్రార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట చేస్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వసతిగృహంలోని విద్యార్థినులందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.
మరో వసతిగృహం అవసరం
తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్‌లోని పీజీ, ఇంటిగ్రేటెడ్ విభాగాలన్నింటిల్లో కలిపి సుమారు 1,200 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇందులో దాదాపు 600 మంది బాలికలే ఉన్నారు. ఇందులో కొందరు డేస్ స్కాలర్ విద్యార్థినులు ఉన్నారు. వర్సిటీ ప్రారంభం నుంచి 85 గదులతో బాలికల వసతి గృహం ఒకటే ఉంది. 280 మంది ఉండాల్సిన చోట 450 మంది ఉంటున్నారు. పరీక్షల సమయంలో మరో 100 మందికి పైగా వస్తుంటారని.. అప్పుడు మరీ ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థినులు వాపోతున్నారు.
"గదుల కొరత, కోతుల బెడద తీవ్రంగా ఉంది. హాల్లోకి వచ్చి ఆహారం, వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. పాములు, విష పురుగులు వస్తున్నాయి. మెస్ హాల్ చిన్నగా ఉండటంతో ఒకేసారి భోజనం చేయలేకపోతున్నాం. నీటి కొరత ఉంది. విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిపడా లేవు. కొన్ని సందర్భాల్లో కళాశాలకు సమయానికి వెళ్లలేకపోతున్నాము. వైఫై సౌకర్యం లేదు. సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది."
- తులసి, వర్సిటీ బాలికల వసతిగృహ విద్యార్థిని
"వసతిగృహంలో నాసిరకం భోజనం పెడుతున్నారు. గతంలో అన్నంలో వెంట్రుకలు, ఈగలు, ప్లాస్టిక్ కవర్లు వచ్చాయి. రుచికర ఆహారం పెట్టాలని అధికారులకు చాలాసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. ఫ్యాన్లు లేవు. గదుల కొరత ఉంది. కోతులు, పాములు వస్తున్నాయి."
- సుకన్య, వర్సిటీ బాలికల వసతిగృహ విద్యార్థిని
ఇదీ చదవండి: కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం.. నిరసనకు వెళ్లకుండా అడ్డగింత