Bodhan Commercial Taxes Scam : బోధన్ వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలానాల కుంభకోణం కేసు దర్యాప్తునకు సాంకేతిక అంశాలు మరింత అడ్డుపడుతున్నాయి. సుమారు రూ.230 కోట్లకు సంబంధించిన ఈ కుంభకోణంలో ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు సంబంధించిన నివేదిక ఆలస్యమవుతుండటం దర్యాప్తునకు ఆటంకంగా మారుతోంది. కేసుతో సంబంధమున్నట్లుగా అనుమానిస్తున్న ట్రేడర్ల చేతిరాతను తేల్చడంలో ఈ నివేదిక కీలకం కావడం గమనార్హం. ఇందులో భాగంగా రెండేళ్ల కిందటే కేసుకు సంబంధించిన కీలకపత్రాల్ని తెలంగాణ సీఐడీ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది. ప్రయోగశాలలో వనరుల కొరత కారణంగా నివేదికలో తీవ్రజాప్యం కొనసాగుతోంది. రెండేళ్లు దాటినా ఈ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు.
ఈ కుంభకోణంపై బోధన్ పోలీసులు తొలుత 2017లో కేసు నమోదు చేశారు. ప్రభుత్వాదేశాలతో రంగంలోకి దిగిన తెలంగాణ సీఐడీ పలు ఆధారాల్ని సేకరించింది. ఈక్రమంలోనే కుంభకోణంతో సంబంధముందని అనుమానిస్తున్న 9 మంది ట్రేడర్లకు సంబంధించిన కేవైసీ వివరాలు, చేతిరాత, సంతకాలను ఆయా బ్యాంకుల నుంచి సేకరించింది. మరోవైపు నకిలీ చలానాలపై ఉన్న చేతిరాతల్ని పరిశీలించింది. అయితే కేవైసీ, నకిలీ చలానాలపై ఉన్న చేతిరాతలు సరిపోతున్నాయా..? అని తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం తాము సేకరించిన పత్రాల్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించింది.
ఇదీ చూడండి : పైలెట్లకు శాపంగా ఏవియేషన్ అకాడమీల లోపాలు!