Farmer Suicide Attempt : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందిలో ఓ యువ రైతు సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. ప్రత్యామ్నాయ పంటగా పొద్దు తిరుగుడు వేసి నష్టపోయానని....పరిహారం చెల్లించాలని నిరసన తెలిపాడు. జగదాంబ తండాకు చెందిన బాధవత్ జేతులాల్...ప్రభుత్వ సూచనల మేరకు ఏడు ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంట సాగు చేశాడు. విత్తనాలకు కొరత ఏర్పడగా... ఆసరాగా చేసుకున్న ప్రైవేటు కంపెనీలు నకిలీవి విక్రయించారని రైతులు తెలిపారు. ఫలితంగా భీమ్‌గల్, సిరికొండ ప్రాంతాల్లో వందల ఎకరాల్లో మొలకలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Nizamabad Farmer Suicide Attempt : పంట పూర్తిగా నష్టపోయిందని సర్కారు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... టవర్ ఎక్కి యువరైతు జేతులాల్ నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాధితుడితో ఫోన్‌లో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తానని చెప్పారు. తహసీల్దార్, సీఐలు ఘటనా స్థలానికి చేరుకొని రైతుకు నచ్చచెప్పడంతో కిందికి దిగాడు.
"కేసీఆర్, మంత్రులు చెప్పారని వరికి ప్రత్యామ్నాయంగా పొద్దు తిరుగుడు పంట వేశాను. కానీ నకిలీ విత్తనాల వల్ల నేను వేసిన పంటంతా పాడైపోయింది. విత్తనాలు వేసి నెలలు గడుస్తున్నా మొలకలు రాలేదు. ఏడెకరాల్లో పొద్దుతిరుగుడు పంట వేసి నష్టపోయాను. లక్షల్లో పెట్టుబడి పెట్టాను. అప్పుల పాలయ్యాను. దయచేసి నన్ను ఆదుకోండి. లేకపోతే నాకు చావే గతి." - జేతులాల్, బాధిత రైతు
ఇవీ చదవండి :