ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఇటీవల వందలాది మంది అస్వస్థతకు గురై ఉన్నట్టుండి కుప్పకూలటం చూశాం. వారి రక్తంలో సీసం, పాదరసం తదితర రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. అవి ఒంట్లోకు ఎలా చేరాయో తెలియలేదు. మనం తినే ఆహారోత్పత్తుల వల్ల పురుగు మందుల అవశేషాలు మన శరీరంలోకి చేరి అంతుచిక్కని రోగాలకు కారణమవుతున్నాయి. ఈ విషయాన్ని పదేళ్ల కిందటే గ్రహించిన నిజామాబాద్ జిల్లా రైతు... పాత తరం వరి వంగడాలతో సేంద్రీయ సేద్యం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రైతు నేస్తం పురష్కారం అందుకున్న ఆదర్శ రైతుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
సేంద్రియంపై మొగ్గు ఇలా...
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం చింతలూరుకు చెందిన నాగుల చిన్న గంగారాం ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్థానికంగా ఆయనని చిన్ని కృష్ణుడిగా పిలుస్తారు. ఓ యోగా గురువు సూచనతో సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపారు. ఆరో తరగతి చదివిన ఆయన పదేళ్ల క్రితం వరకు సాధారణ రైతే. అనారోగ్య సమస్యలతో ఆయన యోగా శిక్షణకు వెళ్లిన చోట సేంద్రీయ ఆహార ఉత్పత్తులను తెలుసుకున్నారు.
పెద్ద వయసులోనూ చలాకీగా...
రసాయన ఎరువులు లేకుండా పాలేకర్ విధానంలో సాగును ఆరంభించారు. పలు రాష్ట్రాల నుంచి పాతతరం వరి వంగడాలు సేకరించి పంటలు పండించారు. 67 ఏళ్ల వయసులోనూ చలాకీగా వ్యవసాయం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఎందరికో ఆదర్శం
చిన్ని కృష్ణుడు ఇప్పటికి 110 రకాల ఔషధ గుణాలున్న వంగడాలు సాగు చేసి నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చారు. అధికారులు, వ్యవసాయ విద్యను అభ్యసించే వారు ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. తాను పండించే విత్తనాలను పలు గ్రామాల రైతులకు ఉచితంగా ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. సేంద్రీయ గ్రామాలే తన లక్ష్యమని చెబుతున్నారు. చిన్ని కృష్ణుడిని ఆదర్శంగా తీసుకొని చాలామంది సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి కనబర్చుతున్నారు.
ఇదీ చదవండి: ఆకాశంలో అద్భుతం- 400 ఏళ్ల తర్వాత ఇవాళే!