నిజామాబాద్ సీతారాంనగర్ కాలనీకి చెందిన శంకర్ తన ఆరేళ్ల బాబు మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటం వల్ల వైద్యం కోసం అన్ని ప్రైవేటు ఆస్పత్రులు తిరిగారు. ఎక్కడా ఓపీ లేక వైద్యుడిని ఫోన్లో సంప్రదించి మాత్రలు తీసుకెళ్లారు. జ్వరం తగ్గలేదు. బాలుడికి గొంతు నొప్పి ఉంది. కరోనా భయంతో ఐదో రోజు పిల్లాడిని బండిపై ఎక్కించుకొని నగరమంతా తిరిగినా ఓపీ లేదు. చివరకు ఒక వైద్యుడికి చూపించారు.
మాక్లూర్ మండలం అమ్రాద్‌కు చెందిన ఐదు నెలల గర్భిణి జ్వరం, కడుపు నొప్పితో జిల్లా కేంద్రానికి వచ్చారు. ప్రైవేటులో ఎక్కడా ఓపీ చూడలేదు. తీరా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ రెండు మాత్రలిచ్చి పంపారు. ఆదివారం జ్వరం పెరిగింది. మళ్లీ ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ ఓపీ చూడలేదు. చేసేదేమీ లేక కంటతడి పెడుతూ గ్రామానికి వెళ్లిపోయారు.
కొవిడ్-19 కారణంగా రోస్టర్ పద్ధతిలో వైద్యులకు విధులు కేటాయించారు. వీరిలో ఎస్‌ఆర్‌లు, జేఆర్‌లు, ట్యూటర్లే ఎక్కువగా ఉన్నారు. డ్యూటీలు వేసినవారికే మళ్లీ కేటాయించారని కొందరు జూనియర్ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 132 మంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు ఈ రోస్టర్‌లో లేకపోవడం గమనార్హం. సాధారణ ఓపీలో సైతం సీనియర్లు కనిపించడం లేదు. కొవిడ్‌లో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి కనీసం మాస్కులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే..
ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కానీ, అత్యవసర సమయంలో కొందరే విధులకు వస్తున్నారు. సీనియర్ వైద్యులు కనిపించడం లేదు. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయి. కొవిడ్ విభాగంలో ఒక జూనియర్ వైద్యుడికి తోడు సీనియర్‌ను కేటాయించాలని కోరుతున్నారు. కరోనా భయంతో కొందరు వైద్యులు ప్రభుత్వ వైద్యకళాశాలకు వచ్చి ఆస్పత్రికి రాకుండా వెళ్తున్నట్లు తెలిసింది. ఇటువైపు కన్నెత్తి చూడని వారే ఉన్నతాధికారులకు సూచనలు ఇస్తున్నారని తోటి వైద్యులు ఆరోపిస్తున్నారు.
భారీగా తగ్గిన ఓపీ
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిత్యం 1400 తగ్గకుండా ఓపీ ఉండేది. కరోనా కారణంగా 300లకు తగ్గింది. అత్యవసరమైతేనే ఓపీకి రావాలని చెప్పి.. వారు రావడం మానేశారు. ప్రైవేటు ఆస్పత్రులు అన్నీ మూసి ఉంచడం వల్ల రోగులు వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యనిపుణులతో స్త్రీవైద్య విభాగం, మెడిసిన్ విభాగం, పిల్లల విభాగాల ఓపీ ఏర్పాటు చేసి.. దీనిపై ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రధాన బస్టాండు ఎదుట ఉన్న కొత్త భవనంలో ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేస్తే రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. కొవిడ్ విభాగంలో విధులు లేని వారిని ఇక్కడ కేటాయించాలి.
ఐఎంఏ వైద్యులు ముందుకు రావాలి
గర్భిణులు, పిల్లలు, ఇతర సమస్యలతో వచ్చే రోగులు తగిన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ చూసేందుకు ఐఎంఏ, ప్రైవేటు నర్సింగ్‌హోం అసోసియేషన్ వైద్యులు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు, శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఈ విభాగంలో స్త్రీ వైద్య నిపుణుల సాయం అవసరం ఉంది.
అందరికి విధులు కేటాయిస్తున్నాం. ఒకేసారి అందరి సేవలను ఉపయోగించుకోకుండా కొందరికి కొవిడ్ విభాగం, మరికొందరికి వార్డుల్లో డ్యూటీలు వేశాం. ఎవరూ ఇబ్బంది పడకుండా చూస్తాం.
- నాగేశ్వర్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్
ఇవీ చూడండి: 'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'