నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో 12-13 శతాబ్దంలో కాకతీయులు రామాలయాన్ని నిర్మించారు. సాధారణంగా కాకతీయ రాజులు శైవాలయాలు నిర్మించి శివారాధన మాత్రమే చేసేవారు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం వైష్ణవ ఆలయాన్ని నిర్మించారు. రాముడు నడయాడాడన్న నమ్మకంతోనే ఆ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. సీతాదేవినిని వెతుకుతూ... దక్షిణభారత దేశానికి వచ్చిన శ్రీరాముడు డిచ్పల్లిలో నెలన్నర పాటు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఆలయానికి సమీపంలో దీక్షానగరం అనే గ్రామంలో యుద్ధానికి సంబంధించిన సామాగ్రి అమ్మేవారు. వాటిని కొనేందుకు వచ్చిన వ్యాపారులు... విశ్రాంతి తీసుకోవడానికి ఈ గుడి నిర్మించారని కూడా ప్రచారంలో ఉంది.
వందల ఏళ్లు ఖాళీగా...
తాబేలు ఆకారంలో ఆలయం నిర్మాణానికి పునుకోగా.. మధ్యలోనే పనులను ఆపేశారు. ముందు భాగంతో పాటు శిఖరాన్ని నిర్మించలేరు. దీంతో ఆలయంలో విగ్రహాలు ప్రతిష్ఠించపోవడంతో... కొన్ని వందల ఏళ్లపాటు ఆలయం ఖాళీగా ఉంది. మధ్యలో మహ్మదీయులు ఆలయాన్ని స్థావరంగా చేసుకుని వినియోగించుకున్నట్లు చరిత్ర చెబుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950 ప్రాంతంలో డిచ్పల్లి గ్రామస్థులంతా కలిసి సీతారాముల విగ్రహాలను తెప్పించి ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆ గుడిలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా ఓసారి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు.
రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషం. కానీ ఎన్నో ప్రత్యేకతలు కల్గిన డిచ్పల్లి రామాలయాన్ని అభివృద్ధి చేయకపోవడం బాధాకరం. కృష్ణశిలతో నిర్మించిన ఈ ఆలయం... ఎండకు చల్లదనాన్నిస్తూ... చలికి వెచ్చదనాన్నిస్తుంది. ఈ ఆలయాన్ని కూడా అధికారులు పట్టించుకొని అభివృద్ధి చేస్తే... యునెస్కో గుర్తింపు వస్తుంది. - వినోద్ కందగిరి, స్థానికుడు
అడుగడుగునా అద్భుతాలే..
ఖిల్లా రామాలయ నిర్మాణంలో కాకతీయుల కళా వైభవం అడుగడుగునా కనిపిస్తుంది. రామప్ప ఆలయం నిర్మించిన శిల్పులే ఈ ఆలయానికి పని చేశారని ప్రతీతి. ఏకకాలంలోనే రామప్ప, డిచ్పల్లి ఆలయాల నిర్మాణాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గుడిని నలుపు, తెలుపు శిలలను ఉపయోగించి నిర్మించారు. దేవాలయానికి వెళ్లే మార్గంలో మొదట ఎదురయ్యే తోరణమే శిల సంపదను చాటి చెబుతుంది. 180కి పైగా మెట్లు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడి విగ్రహం, నవ గ్రహాలు ఉన్నాయి. వివిధ రకాల కళలను శిల్పులు ఆలయంపై ప్రతిబింబించారు. ఒక్కో కళకు సంబంధించిన చిత్రాలను ఈ శిలలపై చెక్కారు. 64 కళల్లో ప్రధానమైన ఎనిమిది కళలు... జీవ, వృక్ష, కామ, జంతు, చిత్ర, నృత్య, శిల్ప, వేదాలు ఇక్కడ కనిపిస్తాయి.
త్రీడీ ఆకృతిలో ఆవు.. సింహం నోట్లో ఏనుగు తల పెట్టినట్లు..
ఆలయం పైభాగంలో ఐదు తలలున్న ఆవు త్రీడీ ఆకృతిలో కనిపిస్తుంది. ఓ చిత్రంలో ఆవు, ఏనుగుకు ఒకే తలభాగం ఉంటుంది. ఎడమ వైపు చూస్తే ఆవు తల ఎత్తినట్లు... కుడి వైపు నుంచి చూస్తే ఏనుగు తల కిందకు కనిపిస్తుంది. అలాగే గర్భ గుడిలో రాముడికి అభిషేకం చేసిన నీళ్లు ఎడమ వైపు ఉన్న మొసలి బొమ్మ నుంచి కిందకు వస్తాయి. సింహం, ఆవు, ఏనుగు చిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. సింహం నోట్లో ఏనుగు తలపెట్టినట్లు ఉండే శిల్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే గుండ్రంగా గీసిన జింకల బొమ్మ, స్వాగతం పలికే ఏనుగు బొమ్మలు, యుద్ధరీతులు, నృత్యం, అడవి జంతువుల బారి నుంచి రక్షించుకునే యుద్ధకళ, రాజులు ధరించిన ఆభరణాల తాలూకు చిత్రాలు కనిపిస్తాయి. ఆలయ నిర్మాణానికి ముందు చుట్టూ బలమైన గోడ నిర్మించి దానిలో మట్టి నింపి మళ్లీ దానిపై గోడ నిర్మించి మట్టి పోశారు. ఇలా ఐదు దశలుగా చేశాక పైన గుడి నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. మహ్మదీయుల కాలంలో శిల్ప సంపద దెబ్బతినట్లు స్థానికులు చెబుతున్నారు.
రామప్ప ఆలయం, ఖిల్లా రామాలయాన్ని ఒకేసారి నిర్మించారు. అక్కడ, ఇక్కడ ఒకే రకమైన రాయిని ఉపయోగించారు. అక్కడ ఆలయాన్ని నిర్మించిన శిల్పులే... ఈ ఆలయాన్ని నిర్మించారు. రామప్పను వారసత్వ కట్టడిగా గుర్తించినట్లే.. ఖిల్లా రామాలయాన్ని కూడా గుర్తించాలి. - జలందర్, ఆలయ మాజీ డైరెక్టర్
ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఖిల్లా రామాలయం అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని... ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి: Ramappa Temple: రామప్ప ఆలయం కాకతీయుల కళాత్మకత, అద్భుత శిల్పసంపదకు నెలవు