Telangana Rain Effect 2023 : తొలకరి వర్షాలకు దుక్కులు చేసి విత్తనాలు నాటిన రైతన్నకు నెల ఆలస్యంతో వచ్చిన వర్షాలు గుబులు రేపాయి. పది రోజుల పాటు కురిసిన భారీ వానలు, వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల రైతులు వరదల తీవ్రతకు విలవిలలాడారు. పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలు గుండెకోతను మిగుల్చుతున్నాయి.
Crop Loss in Nizamabad : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 277 గ్రామాల్లో.. అతివృష్టి పంటలపై తీవ్ర ప్రభావం చూపిందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 33 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వరి, సోయాబీన్, మొక్క జొన్న, పసుపు పంటలకు అపార నష్టం వాటిల్లింది. సగటున ఎకరానికి పది వేల పెట్టుబడి వర్షార్పణమైందని రైతులు వాపోయారు. వేరే పంట వేయాలంటే సమయం, అనువైన పరిస్థితి లేదంటున్న అన్నదాతలు.. సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఎక్కువ నష్టం జరిగింది. బీర్కూర్, గాంధారి, మచారెడ్డి మండలాల్లో చెరువులు తెగి, గండ్లు పడి, వాగులు పోటెత్తి.. ఇసుక మేటలు వేయడం వల్ల అన్నదాతకు తీరని శోకం మిగిలింది. ఏప్రిల్, మేలో వడగళ్ల వానకు నష్టపోయిన వారికి ప్రభుత్వం అందిస్తామన్న పదివేల సాయం ఇప్పటి వరకు అందలేదు. ఇప్పుడు మళ్లీ వరద తీవ్రతకు కుదేలయ్యామని.. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
Crop Loss in Warangal : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఎర్రబంగారంగా పిలిచే మిర్చి సాగు ఎక్కువగా చేస్తారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలకు మిరప గింజలు కొట్టుకుపోయి తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నారు. ఎకరాకు విత్తనాలకు దాదాపు 40 వేలు ఖర్చు చేశామని.. అదంతా వరదపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా మిర్చి రైతులకు ప్రకృతి ఏమాత్రం సహకరించడం లేదని మున్ముందు సాగు ఎలా చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. పొలాల్లో ఆరబోసిన పల్లికి మొలకలు వచ్చాయని.. చేతికొచ్చే సమయంలో పంట పనికిరాకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు. వరిపొలాల్లో ఇసుక మేటలు చూసి రైతులు లబోదిబోమంటున్నారు.
Telangana Crop Loss 2023 : భూపాలపల్లి జిల్లా రామన్నగూడెం తండాకు చెందిన శ్రీరాములు నాలుగున్నర ఎకరాల్లో సాగుచేసిన బొప్పాయి కాయలు నామరూపాల్లేకుండా పోయాయి. తోట ఫెన్సింగ్ పూర్తిగా ధ్వంసమైంది. వరదల్లో కొట్టుకుపోయిన కాయలను చూసి.. శ్రీరాములు కన్నీటి పర్యంతమయ్యారు. రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని వెంటనే పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వరుణ ప్రతాపం వల్ల ఈ వానాకాలం పంట దిగుబడిపై ఆశలు వదులుకోవాల్సిందేననే నైరాశ్యం రైతుల కళ్లల్లో కనిపిస్తోంది.
"ఒక మొక్క రూ.20 చొప్పున 5000 మొక్కలు తెచ్చాను. 18 నెలలుగా సాగు చేస్తున్నాను. 4 ఎకరాల్లో పెంచుతున్నాను. ఈ పంట కోసం దాదాపు రూ.12-18 లక్షలు పెట్టుబడి పెట్టాను. కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల పంట మొత్తం నాశనం అయింది. అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం నాకు సాయం చేయాలని కోరుతున్నాను." -శ్రీరాములు, బొప్పాయి రైతు
ఇవీ చదవండి :