conjunctivitis precautions in Telugu : కళ్ల కలక వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. వైరస్, బ్యాక్టీరియాతో వచ్చే కలకలు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా బడుల్లో విద్యార్థులకు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోంది. అలర్జీతో కలిగే కలక.. ఆ వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. వైరస్ లేదా అలర్జీతో కలిగే కలక తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలతో వస్తుంది. తగిన జాగ్రత్తులు పాటిస్తే అంతే వేగంగా తగ్గిపోతుంది. బ్యాక్టీరియాతో కలిగే కలక కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుందని, కళ్ల మీద అధిక ప్రభావం ఉంటుందని, కంటి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
"ప్రస్తుతం ఈ కాలంలో చాలా మందికి కళ్ల కలక వస్తుంది. కను గుడ్డును కాపాడే కన్జెక్టైవా అనే పొర కాపాడుతుంది దానికి వచ్చే ఇన్ఫెక్షన్నే కన్జక్టివిటీస్ అంటారు. మూడు విధాలుగా ఈ వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, అలర్జీల వల్ల వస్తుంది. ప్రస్తుతం అందరిలో ఎడినో వైరస్ వల్ల కళ్ల కలక వస్తోంది." - డా. సుజాత, కన్సల్టెంట్ ఆప్తమాలజిస్ట్ కంఠేశ్వర్ హాస్పిటల్, నిజామాబాద్
conjunctivitis Symptoms : ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి ఆ వైరస్ ఇతర వ్యక్తులకు కంటి స్రావాలు, చేతుల ద్వారా చేరుతుంది. ఎక్కువ శాతం చేతులు కళ్లలో పెట్టుకోవడం ద్వారా సోకుతుంది. ఒక కన్ను లేదా రెండు కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో మంట, నొప్పి, దురద ఉండటం, కనురెప్పలు వాపు రావడం, ముఖ్యంగా ఉదయం నిద్ర లేచేసరికి కనురెప్పలు అతుక్కుని కనిపించడం, కళ్ల నుంచి నీరు లేక చిక్కటి స్రావం కారడం, ఎక్కువ వెలుతురు చూడలేకపోవడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వైరస్ వల్ల కలిగే సమస్య ఒకట్రెండు వారాల్లో తగ్గిపోతుందని, బ్యాక్టీరియాతో సమస్య ఏర్పడితే సరైన ఔషధాన్ని తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
"వర్షాకాలంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కళ్ల కలక సహజంగా వస్తుంది. ఇంట్లో ఒక్కరికి వచ్చినా అందరికి సోకే అవకాశం ఉంటుంది. ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే తరచూ చేతులు కడుక్కోవాలి, కళ్ల డ్రాప్స్ సమయానికి వేయాలి, డార్క్ గ్లాసెస్ పెట్టుకోవాలి." - డా. సుజాత, విభాగాధిపతి, నేత్రవైద్య విభాగం, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి
Telangana Pink Eye cases 2023 : లక్షణాలు కనిపించినప్పుడు కళ్లు నలపడం లేదా కళ్ల దగ్గర చేతులు పెట్టడం చేయరాదు. శుభ్రమైన టిష్యూ పేపర్ లేదా చేతి రుమాలుతో తరచూ తుడుచుకోవాలి. నల్లటి అద్దాలు పెట్టుకోవడం ద్వారా లక్షణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవారు. వెంటనే వాటి వాడకం ఆపేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: