Nizamabad Congress: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. మాజీ ఎంపీ మధుయాష్కీ, మాజీ విప్ ఈరవత్రి అనిల్ మధ్య విభేదాలు వచ్చాయి. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశంలో మధుయాష్కీపై అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ ఐఏఎస్, ఐపీఎస్‌లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మధుయాష్కీ తప్పుపట్టడాన్ని అనిల్ దుయ్యబట్టారు. పీసీసీ అధ్యక్షుడి మాటలను సమర్థించాల్సింది పోయి తప్పు పట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, జిల్లా ఇంఛార్జి అంజన్‌కుమార్ యాదవ్ వేదికపై ఉండగానే అనిల్... మధుయాష్కీపై ఘాటుగా మాట్లాడటం విశేషం
వాళ్లు పోయారు ఏమైన అయిందా
'ఇంకా ఎన్ని రోజులు చంపుతారు పార్టీని. హనుమంతరావు ఒకటి మాట్లాడుతాడు. మధుయాష్కీ మాట్లాడుతాడు. తమాషా ఉందా ఈ నాయకులకు. రేపు నేను మాట్లాడిన నన్ను ఎత్తిపడేయండి. పార్టీ వల్లనే మేము బతికినం. పార్టీని కాపాడుకోవల్సిన బాధ్యత మాపై ఉంది. జగ్గారెడ్డి పోతే ఏమైన అయితదా? మధుయాష్కీ పోతే ఏమైన అయితదా? హనుమంతరావు పోతే ఏమైన అయితదా? ఎంతో మంది పోయారు. డి.శ్రీనివాస్, సురేష్ రెడ్డి పార్టీ నుంచి పోయారు. ఏమైంది? సోనియాగాందీ, రాహుల్ గాంధీ ఉన్నరు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నరు. మనం కూడా గట్టిగ ఉండాలి.'- ఈరవత్రి అనిల్, ప్రభుత్వ మాజీ విప్
అందుకే విభేదాలు!
మధుయాష్కీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత జిల్లాలో నేతల మధ్య విభేదాలు పొడచూపాయి. మధుయాష్కీ అసెంబ్లీకి పోటీ చేస్తారన్న వార్తలు ఇందుకు కారణమయ్యాయి. ప్రచార కమిటీ ఛైర్మన్ అయ్యాక.. బోధన్ నియోజకవర్గం ఎడపల్లిలో నియోజకవర్గ ఇంఛార్జి సుదర్శన్‌రెడ్డి లేకుండానే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంపైనా దృష్టి పెట్టారని చర్చ జరగడంతో ఆ నియోజకవర్గ ఇంఛార్జి అనిల్.... మధుయాష్కీపై ధ్వజమెత్తినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. అనిల్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు తీవ్రంగా తప్పుపట్టారు
మీరు చేసిందేంటి?
'మధుయాష్కీని తప్పుపట్టారు. మీరు చేసిందేంటి? కార్యకర్తల సమావేశంలో వాళ్ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడటం కరెక్ట్ పద్దతా? కంట్రవర్సి స్టేట్మెంట్ ఇచ్చేముందు వాస్తవాలు తెలుసుకోని మాట్లాడితే బాగుంటుంది.' - కేశ వేణు, నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు
ఏమైనా ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఇందూరు కాంగ్రెస్‌లో ఒక్కసారిగా కాక రేగింది. మధుయాష్కీ, అనిల్ మధ్య విభేదాలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో చర్చ మొదలైంది.
ఇదీ చదవండి : సభలో ఒక్కసారిగా విరిసిన నవ్వులు.. పడిపడి నవ్విన కేటీఆర్.. ఎందుకంటే..?