నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో శివాజీ విగ్రహ ఏర్పాటు ఉద్రిక్తతలకు దారితీసింది. విగ్రహం తొలగించాలని ఓ వర్గం పట్టుబడగా... మరొకరు తీవ్రంగా వ్యతిరేకించారు. వాగ్వాదం క్రమంగా ఘర్షణగా మారి ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.
144 సెక్షన్ విధింపు
వివాదానికి కారణమైన శివాజీ విగ్రహన్ని కవర్ కప్పి సీజ్ చేశారు. 144 సెక్షన్ విధించినందునా... ప్రజలు గుమిగూడొద్దని పోలీసులు సూచించారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదని సీపీ నాగరాజు పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
లాఠీలతో దాడులు చేయడం ఏంటి?
బోధన్‌లో లాఠీఛార్జ్‌ను భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు అనుమతిచ్చారని తెలిపారు. సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించాల్సిన పోలీసులే... రబ్బర్ బులెట్లతో, లాఠీలతో దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.
సోమవారం బోధన్ బంద్
సోమవారం బోధన్ బంద్‌కు భాజపా, శివసేన, హిందూవాహిని పిలుపునిచ్చాయి. బోధన్‌లో భాజపా శ్రేణులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా బంద్ చేపట్టనున్నట్లు వెల్లడించాయి. ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు అడిషనల్ డీజీ నాగిరెడ్డి బోధన్ చేరుకున్నారు. విగ్రహ ఏర్పాటు వివాదంపై పోలీసు అధికారులతో చర్చించారు.
ఇదీ చదవండి : నన్ను సస్పెండ్ చేస్తే.. రోజుకొకరి బండారం బయట పెడతా: జగ్గారెడ్డి