కలెక్టర్ పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని పాల్డ గ్రామంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పర్యటించారు. నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలో కూడా రోల్ మోడల్‌గా ఉండాలని కలెక్టర్ అన్నారు. పాల్డ గ్రామంలోని వైకుంఠ ధామాన్ని సందర్శించి పలు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం మండలంలోని సర్పంచులు, మండల స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని, గ్రామాల్లో సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
కరోనా సోకకుండా మాస్కు, శానిటైజేషన్, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని అన్నారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, నిత్యం మాస్కు ధరించి, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం మరిచిపోవద్దని అన్నారు. గ్రామంలో ఎవరికైనా పాజిటివ్ అని తెలిస్తే.. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించాలని, గ్రామంలో సోడియం హైడ్రో క్లోరైట్ స్ప్రే చేయాలని సర్పంచులకు సూచించారు. పాజిటివ్ వ్యక్తికి ప్రైమరీ కాంట్రాక్ట్ అయిన వారిని 14 రోజులు క్వారంటైన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
వైకుంఠధామంలో వెయ్యి మొక్కలకు ఒక వన సంరక్షకుడిని నియమించుకోవాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో 400 మొక్కలకు ఒకరిని ఏర్పాటు చేసుకోవాలని, వన సేవకులు గ్రామ పారిశుద్ధ్య పనితో పాటు మొక్కల సంరక్షణ చేయాలన్నారు. గ్రామాలలో ప్రతిరోజు శానిటేషన్ జరగాలని, గ్రామ కార్యదర్శులు ఆ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుప్రియ, డీఆర్డీవో రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్