నిజామాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ్మోహన్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సంతకాలు అయిన తర్వాత కూడా పాసు పుస్తకాలు ఇంకా కొందరు రైతులకు ఇవ్వనట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయని ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా పాలనాధికారి రామ్మోహన్రావు అన్నారు. జారీ అయిన అన్ని పాసు పుస్తకాలు వెంటనే సంబంధిత రైతుకు అందజేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ఏ అధికారి దగ్గరా ఒక్క పాసు పుస్తకం కూడా ఉండడానికి వీలు లేదని తెలిపారు. ఒకవేళ పాలు పుస్తుకం ఉన్నట్లయితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ మధ్యనే తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు జరిగిన బదిలీల నేపథ్యంలో శనివారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో మూడు గంటల పాటు సుదీర్ఘంగా పలు విషయాలపై చర్చించారు. ప్రజావాణి సందర్భంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని కావున అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, ఆర్డీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 165 జంటలకు సామూహిక వివాహాలు