ఒకప్పుడు శ్మశాన వాటిక అనగానే భయంకరమైన వాతావరణం గుర్తొచ్చేది. సౌకర్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వస్తోంది. ప్రశాంతమైన పరిసరాలు, ఆకట్టుకునే వాతావరణం, పచ్చని చెట్లు, ఆకర్షించే బొమ్మలు సహా సకల సౌకర్యాలతో వైకుంఠధామాలు సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 530 పంచాయతీలు ఉండగా.. అన్ని గ్రామాలకు వైకుంఠధామాలను మంజూరు చేశారు. వీటిలో 385 పూర్తి కాగా.. మరో 141 పురోగతిలో ఉన్నాయి. నెలాఖరు కల్లా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుండగా... వివిధ కారణాలతో ఓ నాలుగు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.
ఉద్యానవనంగా వైకుంఠధామాలు
ప్రతి పంచాయతీలో 12లక్షల 60వేలతో వైకుంఠధామం నిర్మిస్తున్నారు. ఉపాధి హామీ కింద భూమిని చదును చేసి అప్రోచ్ రోడ్డు వేస్తున్నారు. హరితహారం కింద మొక్కలు నాటి ఉద్యానవనంగా మారుస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అంత్యక్రియలు చేసేందుకు అవసరమైన బర్నింగ్ ఫ్లాట్‌ఫామ్, ఆర్చ్ నిర్మాణంతోపాటు నీటి సదుపాయం, మూత్రశాలలు, స్నానపు గదులు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటితోపాటు వైకుంఠదామం గోడల మీద ఆకర్షించే చిత్రాలు గీయిస్తున్నారు. రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా దాతల సాయంతో అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. బెంచీలు, ఫ్రీజర్, వైకుంఠ రథాలు, చితాభస్మం భద్రపరిచే లాకర్లు సమకూర్చుతున్నారు.
అన్ని సదుపాయాలతో
అన్ని గ్రామాల్లోని వైకుంఠధామాల్లో అన్ని సదుపాయాలు ఉండేలా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అధికారులు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులతో మాట్లాడి దాతల సాయంతో ఫ్రీజర్, రథాలు సమకూర్చుకునేలా ప్రోత్సహించారు. జిల్లాలో ఇప్పటివరకు 28 గ్రామాల్లో వైకుంఠ రథాలు.... 21 గ్రామాల్లో ఫ్రీజర్లు సమకూర్చుకున్నారు.
ఒకప్పుడు అవస్థల మధ్య సాగిన చివరి మజిలీ యాత్ర.. వైకుంఠదామాల నిర్మాణంతో స్వర్గయాత్రగా మారుతోంది. ప్రభుత్వం నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'అన్నదాతలు నష్టపోవద్దనే మక్కలు కొంటున్నాం'