MLC Kavitha Bandi Sanjay Chitchat in Nizamabad : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో ఇప్పటికే రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒకరికొకరు సంబంధం లేకుండా బద్ధ శత్రువుల మాదిరి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మద్యం కుంభకోణం వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం చూశాం. మరోవైపు కర్ణాటక ఎన్నికల తర్వాత టీకాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉండగా.. బీజేపీ మాత్రం కొంత నిరుత్సాహంతో ఉంది. అలాగే ఆ పార్టీలో చెలరేగుతున్న అంతర్గత గొడవలు బీజేపీకీ కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.
ఒకేచోట కలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ : ఈ క్రమంలో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత పరస్పరం ఎదురై కాసేపు ముచ్చటించారు. ఇప్పుడు అది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పచ్చగడ్డిపై నీరు పోస్తే భగ్గుమనేలా తరచూ ఆరోపణలు చేసుకునే వారిద్దరు నేడు ఒకేచోట కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బస్వ నర్సయ్య నిజామాబాద్ నగర శివారులో నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమంలో వారిద్దరు తారసపడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జిల్లా జడ్పీ ఛైర్మన్ విఠల్ రావును బండి సంజయ్కు కల్వకుంట్ల కవిత పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత బండి సంజయ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
BJP High Command Serious on TS Leaders : రాష్ట్ర బీజేపీలో కల్లోలం.. ఆ నేతలపై హైకమాండ్ సీరియస్
ఆ మాట తెలంగాణ ఉద్యమానికి బాట చూపించింది : సమాజ హితం కోసం కలాన్ని విదిల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సున్నితత్వాన్ని, మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిజామాబాద్లో జరిగిన హరిద రచయితల సంఘం 5వ మహాసభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు. దాశరధి, వట్టికోట అళ్వారుస్వామిని నిజాం కాలంలో ఇందూరు జైలులో బంధించారని, ఆ జైలు గోడ మీద దాశరధి బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న మాట యావత్తు తెలంగాణ ఉద్యమానికి బాట చూపించిందని కవిత పేర్కొన్నారు.
ఆ జైలు గోడను తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.40 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. జూలై 22న దాశరధి జయంతి సందర్భంగా అక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్త తరానికి దాని ప్రాముఖ్యత తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దిల్లీ నగర నడిబొడ్డున ఒక ఆడపిల్లను కత్తిపోట్లు పొడిచి, బండరాయితో తలపై మోది చంపేస్తే కూడా చుట్టూ ఉన్నవాళ్లు వీడియోను చిత్రీకరించారు... కానీ, ఎవరూ ఆపిన పాపానపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమాజం ఎటు నుంచి ఎటు పయనిస్తుందో ఆలోచించుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జబర్ధస్త్ ఫేమ్ రచ్చ రవి, పలువురు కవులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :