manjeera Bridge construction works in Nizamabad: నిజామాబాద్ జిల్లా సాలూరు వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో మంజీర నదిపై వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా 300 మందికిపైగా కార్మికులు, నిపుణులు నిర్మాణం కోసం శ్రమిస్తున్నారు. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తై స్లాబ్ పనులు చేస్తున్నారు. మంజీరా నదిపై గతంలో నిర్మించిన రెండు వంతెనలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గాన్ని ఇటీవలే 63వ నంబరు జాతీయ రహదారిగా గుర్తించారు. కొత్త వారధి నిర్మాణం మొదలుపెట్టారు. గతేడాది వానకాలంలో వరదల వల్ల పునాది స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి. ఈసారి వర్షకాలం వచ్చేలోగా నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించారు.
వంతెన పూర్తైయితే అంతరాష్ట్ర రవాణా మెరుగు అవుతుంది: నిజాం కాలంలో నిర్మించిన లోలెవల్ పాతరాతి వంతెన మీదుగా తాత్కాలికంగా వాహనదారులను అనుమతిస్తున్నారు. అది తక్కువ వెడల్పు ఉన్న బ్రిడ్జిపై ఎదురెదురుగా వాహనాలు ప్రయాణించడం కష్టంగా మారింది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన ఎస్గీ వద్ద మంజీరపై వంతెన నిర్మాణానికి 188 కోట్ల 69 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ మార్గంలో సరకు రవాణా భారీగానే సాగుతుంటుంది. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు వరసల వంతెన నిర్మాణం పూర్తైతే అంతర్ రాష్ట్ర రవాణా మెరుగు పడనుంది. నాణ్యతతో పనులు చేసి వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని.. వర్షకాలంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
"నిజాం కాలంలో ఈ ప్రాంతంలో లో లెవల్ బ్రిడ్జ్ నిర్మించారు. అది కాస్త శిథిలావస్త చేరుకున్నందున 1983-85 కాలంలో నూతన వంతెనను నిర్మించారు. 10 సంవత్సరాల తరవాత ఆ వంతెన కూడా పాడైపోయింది. దీంతో గత రెండు సంవత్సరాలుగా రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ విషయాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రస్తుత కొత్త వంతెనను కడుతున్నారు. ఈ బ్రిడ్జినైనా నాణ్యతతో చేపట్టి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల రాకుండా చూడాలని ప్రభుత్వాలను కోరుతున్నాం. ఈ వంతెనను వీలైనంత తొందరగా నిర్మించి వర్షాకాలానికి ముందే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి." - స్థానికులు
" మహారాష్ట్ర సరిహద్దులో ఆసుపత్రిలో సౌకర్యాలు బాగుంటాయి. అందువల్ల చాలా మంది ఈ వంతెనను ఉపయోగించుకొని రాకపోకలు సాగిస్తారు. ఈ రహదారి లేకపోతే వేరే మార్గం నుంచి వెళ్లాలి. అలా వెళ్లడం వల్ల దూరం, ఆర్థిక భారం ఎక్కువవుతోంది. అందుకే వీలైనంత త్వరగా వంతెనను పూర్తి చేయండి." - స్థానికుడు
ఇవీ చదవండి: