రైతుబంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని, లక్ష రూపాయల రుణమాఫీ చేసేందుకు తెరాస సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ భాజపా నాయకులు బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతు బంధు ,రుణమాఫీతో పాటు నియంత్రిత వ్యవసాయ విధానంపై ప్రభుత్వం పునఃసమీక్ష జరపాలని మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ కోరారు. రైతులకు లాభసాటిగా ఉండే పంట వేసుకునేందుకు స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుందని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య మండిపడ్డారు. ఇలాంటి చర్య సిగ్గుచేటని అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎన్నికైన ఎంపీటీసీలు, ఎంపీపీలను జడ్పీటీసీలను డబ్బుతో కొనుక్కుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. తాము భారత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం నిలిపివేత