దేశీయంగా తయారీ, వస్తు ఉత్పత్తిని ప్రోత్సహించేలా ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరిట ప్యాకేజీలు, రాయితీలు ప్రకటిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)కు తోడ్పాటునిస్తామని బుధవారం ప్రకటించిన కేంద్రం.. రైతులు, పేదలు, మధ్య తరగతికి మేలు చేసే నిర్ణయాలు తీసుకొంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారితం. ఆ తర్వాత బీడీ పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెలిశాయి. వీటిలో 90వేల మందికిపైగా పని చేస్తుంటారని ఓ అంచనా.
ఆరు నెలల పీఎఫ్
ఉద్యోగులు, కార్మికుల పీఎఫ్ మొత్తాన్ని ఆరు నెలల పాటు కేంద్రమే చెల్లించనుంది. ఏదైనా సంస్థలో 100 మంది కార్మికులు ఉండి వారిలో 90 శాతం మంది 15వేల లోపు వేతనం కలిగి ఉంటే ఇందుకు అర్హులుగా నిర్ణయించారు. ఆరు నెలల కాలానికి మొత్తం 24 శాతాన్ని కేంద్రమే భవిష్యనిధికి చెల్లిస్తుంది. సుమారు 15వేల మందికి సంబంధించి సుమారు రూ.6 కోట్ల లబ్ధి కలగనుంది.
ఎక్కడైనా రేషన్
దేశంలో ఎక్కడైనా రేషన్ పొందేలా పోర్టబిలిటీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వన్ నేషన్-వన్ రేషన్ కింద దేశంలో ఎక్కడైనా రేషన్ పొందవచ్ఛు దీని కింద ఉభయ జిల్లాల్లో ఉంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 12వేల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
4.10 లక్షల రైతులకు మేలు
ఉభయ జిల్లాల్లో చిన్న, సన్నకారు రైతులు 4.10 లక్షల మంది ఉన్నారు. ఇందులో 90 శాతం మంది పంట రుణాలు తీసుకొంటున్నారు. వీటిపై మూడు నెలల మారటోరియం ప్రకటించడంతో 3.70 లక్షల మంది రైతులకు వెసులుబాటు కలగనుంది.
సకాలంలో రుణాలు చెల్లించే వారి వడ్డీ ఉపసంహరణతో వేలాది మంది రైతులకు మేలు చేకూరనుంది.
రైతులు అడిగిన వెంటనే రుణం ఇచ్చేలా వర్క్ క్యాపిటల్ పథకం రైతన్నకు దన్నుగా ఉండనుంది.
కూలీలు, కార్మికులకు అభయం
10 మందికి పైగా పనిచేసే సంస్థల్లో కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయం కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఉభయ జిల్లాల్లోని 40వేల పైచిలుకు కూలీలకు లబ్ధి చేకూరనుంది. సామాజిక భద్రతా పథకం, అసంఘటిత రంగ కార్మికులకు నిధి మేలు చేకూర్చనున్నాయి. వలస కూలీలకు చౌకగా ఇంటి అద్దె ఉండేలా పీపీపీ పద్ధతిలో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు.
మరికొన్ని
వీధి వ్యాపారులను ఆదుకొనేలా ఐదువేల మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు వర్క్ క్యాపిటల్.
రూ.6-.18 లక్షలు వార్షిక ఆదాయం కలిగిన వారి గృహ రుణాలపై ఏడాది పాటు వడ్డీ రాయితీ.
గిరిజనులకు ఉపాధి కల్పించేలా అడవుల సంరక్షణ, పెంపకం కింద కంపా పథకం వంటి నిర్ణయాలను కేంద్రం ప్రకటించింది.
కేంద్రం నిర్ణయంతో మేలు
కేంద్రం తీసుకొంటున్న నిర్ణయాలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మేలు జరగనుంది. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా వస్తూత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో కేంద్రం ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు అందించాలి.
- వెంకట నర్సాగౌడ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిజామాబాద్ అధ్యక్షుడు