నిజామాబాద్లో ఉంటున్న గంగోని బాలమణి(65) అనే వృద్ధురాలని తన కుమారుడు గతంలోనే వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నాడు. అయితే అక్కడ ఆమెకు 25 రోజుల క్రితం కొవిడ్ నిర్ధారణ కావడం వల్ల జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. వారం క్రితం నెగిటివ్ రావడం వల్ల ఇంటికి తీసుకెళ్లాలని కుమారుడికి ఫోన్ చేస్తే ఆయన నుంచి స్పందనలేదు. చివరికి ఆసుపత్రి వర్గాలు రెండ్రోజుల క్రితం వృద్ధురాలిని తీసుకొచ్చి ఇంటి వద్ద దించి వెళ్లారు. అయినా కుమారుడు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. కరోనా కారణంగా వృద్ధాశ్రమాన్ని మూసివేయడంతో అక్కడికి వెళ్లే పరిస్థితి లేక బాలమణి ఇంటి వసారాలో ఉండిపోయింది.
ఇది నచ్చని కుమారుడు ఇంటికి తాళం వేసుకొని భార్యా పిల్లలతో కలిసి వేరేచోటుకు వెళ్లిపోయాడు. ఆ వృద్ధురాలు ఇతరుల దగ్గరికి వెళ్లలేక ఇంటి వసారాలోనే వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ అవస్థలు పడుతోంది. కుమారుడి ఆదరణకు నోచుకోలేక.. సమీపంలోని వాళ్లు పెట్టే భోజనం తింటూ తన పరిస్థితికి కుమిలిపోతోంది. కుమారుడు విద్యుత్తు శాఖలో ఏఈగా పనిచేస్తున్నాడని, ఎంతమంది ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆమె బంధువులు, చుట్టుపక్కల వారు తెలిపారు.
ఇదీ చూడండి: న్యాయం కోసం మృతుల కుటుంబసభ్యుల ధర్నా