నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతగా ఆ చట్టానికి సంఘీభావంగా శనివారం నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచాందా మండలంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కనకాపూర్ వద్ద ఈ ర్యాలీని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం కేసీఆర్ చిత్రపటానికి నాయకులు పాలు, పూలతో అభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌కు మద్దతు తెలిపేందుకు కృతజ్ఞతగా అన్ని మండలాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కనకాపూర్ నుంచి లక్షణచాందా మండల కేంద్రం వరకు ర్యాలీ కొనసాగింది.
రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారం రెవెన్యూ శాఖలో అవినీతిని రూపుమాపు చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు. కొత్త రెవెన్యు చట్టం రావడం వల్ల భూకబ్జాలు తగ్గుతాయని భూమిపై పూర్తి స్వేచ్ఛ హక్కు ఆ భూమి యాజమానికే ఉంటుందని వివరించారు.
భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఆ భూములు సురక్షితంగా ఉండేందుకు ధరణి వెబ్సైట్ అందుబాటులో రానుందని స్పష్టం చేశారు. భూముల వివాదాల్లో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోకుండా ఉండేందుకు చట్టం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సర్కారు ఖజానా నింపుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్: అఖిలపక్షం