నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జె. గంగాధర్(16) కళాశాల సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ముథోల్ మండలం ముద్దల్ గ్రామానికి చెందిన గంగాధర్ ముథోల్ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ( బైపీసీ ) చదువుతున్నాడు. సోమవారం ఉదయం నుంచి కనిపించకపోవడం వల్ల ప్రిన్సిపల్, సిబ్బంది, తోటి విద్యార్థులు చుట్టుపక్కల వెతకగా.. కళాశాల పక్కనే గల ముళ్ల పొదల్లోని ఓ చెట్టుకు వేలాడుతూ గంగాధర్ మృతదేహం కన్పించింది. సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, ముథోల్ పోలీసులకు తెలిపారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భైంసా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న డీసీవో సరస్వతి కళాశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి బంధువులు, గ్రామస్థులు, వివిధ సంఘాల నాయకులు కళాశాలకు చేరుకొని సిబ్బందిని నిలదీశారు. అనంతరం భైంసా-బాసర రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యమే విద్యార్థి మృతికి కారణమని ఆరోపించారు.
డీసీవో సరస్వతి ఆందోళనకారులకు నచ్చజెప్పడం వల్ల ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి : భార్య కళ్ల ముందే భర్తను చంపేశారు..