నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన వీర కిశోరం సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన జీవితం యువతకు ఆదర్శప్రాయమని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పుప్పాల పిరాజీ అన్నారు.
16వ శతాబ్దంలో గౌడ కుటుంబంలో పుట్టి వేలమందితో సైన్యాన్ని ఏర్పాటు చేసి.. మొఘల్ రాజుల మీద యుద్ధం ప్రకటించిన వీరుడని కీర్తించారు. మొఘల్ రాజుల కోటలను ఆక్రమించుకొని పేదలకు పన్ను భారం తప్పించిన గొప్ప ఆలోచనాపరుడని అన్నారు. తెలంగాణలో అక్రమ వసూళ్లు, శ్రమ దోపిడి చేస్తున్న మొఘల్ సామ్రాజ్యంపై పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరత్వాన్ని తెలుగు రాష్ట్రాలు విస్మరించాయని, స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని పిరాజీ తెలిపారు.
ఇదీ చూడండి : పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి