సహ్యాద్రి పర్వతాల మధ్య వెలసిన నిర్మల్ పట్టణం చుట్టూ... ఎత్తైన గుట్టలు, ఏపుగా పెరిగిన వృక్ష సంపద అందుబాటులో ఉంది. సహజంగానే కోతులకు ఆవాసంగా మారింది. ఇక్కడ కోతుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నవంబర్ 20, 2017న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్రం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. అన్నీ కుదిరితే ఆగస్టు 15న ప్రారంభించేందుకు అటవీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట కోతులు మనుషుల్ని గాయపరుస్తున్నాయి. ఒక కోతిని కొట్టడానికి ప్రయత్నిస్తే... పదుల సంఖ్యలో కోతులు కరవడానికి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే తరహా పరిస్థితి. కోతి చేష్టలకు కళ్లెం వేసేందుకే... నిర్మల్ జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో వానర సంరక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న కోతులను తొలుత ఈ కేంద్రానికి తీసుకువస్తారు. కనీసం వారం రోజుల పాటు ఈ కేంద్రంలో ఉంచి ఇక్కడి వాతావరణానికి అలవాటు చేస్తారు. తదనంతరం వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు. తర్వాత 10 నుంచి 15 రోజుల పాటు వాటిని పరీక్షించి ఆపై ఆ కోతులను సమీపంలోని అడవుల్లో వదిలేస్తారు. ఒకేసారి 300 కోతులను సంరక్షించేలా ఈ కేంద్రం సిద్ధం చేస్తున్నారు.
అడవుల్లో వాటికి ఆహారం కోసం పండ్ల మొక్కలు నాటాలని అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతాల్లో జామ, ఉసిరి, చింత, అల్లనేరేడు, అడవి మామిడి తదితర పండ్ల మొక్కలు నాటుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. పండ్లమొక్కలు అందుబాటులోకి వస్తే... చాలావరకు కోతులు అడవుల్లోనే ఉంటాయి. ఫలితంగా ఇబ్బందులు దూరమవుతాయి.
ఇదీ చూడండి:'వాజ్‌పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'