Pregnant Women Gives Birth on the Road in Nirmal : చుట్టూ కారడవి.. అర్ధరాత్రి.. రహదారి లేని దుస్థితి. ప్రసవ వేదన పడుతున్న ఆదివాసీ మహిళను గ్రామస్థులు ఎడ్ల బండిలో తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువై మార్గం మధ్యలో ప్రసవించిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో చోటుచేసుకుంది.
దొందారి పంచాయతీ పరిధిలోని వస్పల్లి గ్రామానికి చెందిన సిడాం సరితకు సోమవారం అర్ధరాత్రి పురుటి నొప్పులు వచ్చాయి. గ్రామస్థుల సహకారంతో ఎంగ్లాపూర్ వరకు ఎడ్ల బండిలో తీసుకొస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అవాల్ అంబులెన్స్‌లో తల్లీ, బిడ్డను పెంబి పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.
దోత్తి వాగు అవతలి గ్రామాల ఆదివాసీలకు కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో రహదారులు సైతం లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దేవునిపైనే భారం వేసే దుస్థితి నెలకొందని ఆదివాసీలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతున్నా.. ఇప్పటికీ పలు ఏజెన్సీ ప్రాంతాలకు కనీస సౌకర్యాలు కరవయ్యాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, కరెంట్, మంచి నీటి వసతి వంటి వాటికీ ప్రజలు నోచుకోవడం లేదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు దగ్గరిలోని పట్టణానికి వెళ్లాలన్నా.. లేదా ఆ ప్రాంతానికి ఏ వాహనాలైనా రావాలన్నా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.
'మా మొర ఆలకించండి మహాప్రభో' అని ఆ అడవిబిడ్డలు వేడుకున్నా.. పట్టించుకున్న నాథుడే కరవయ్యారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగే ప్రజాప్రతినిధులకు.. 'కష్టమొచ్చింది సారూ' అంటే కనీసం పలకరించేంత సమయం కూడా దొరకడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి.. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కాకపోయినా.. కనీస సౌకర్యాలైన కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చూడండి..
డోలీలో గర్భిణీ.. దారి మధ్యలోనే ప్రసవం.. చిన్నారి మృతి
'రోడ్లు ఎప్పుడేస్తారు..? ఈ గల్లి నుంచి ఒక్క ఓటు కూడా పడదు..!'